సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి కాదిక్కడి మేటర్. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఇంకో వర్మ గురించి. ఆయనే ప్రశాంత్ వర్మ. 'అ' సినిమాతో అందరితోనూ 'వావ్' అనిపించుకున్న ఈ దర్శకుడు ఇటీవలే 'కల్కి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. చేసిన రెండు సినిమాలూ కమర్షియల్‌గా అద్భుత విజయాలేమీ సాధించేయకపోయినా, ఏదో 'స్పార్క్' అతనిలో వుందనే విషయం సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. ఆ స్పార్క్ అక్కినేని నాగార్జునకీ బాగా నచ్చిందట.
అందుకే తన కుమారుడు అఖిల్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందించాలని అక్కినేని నాగార్జున ఫిక్సయ్యాడంటూ ప్రచారం జరుగుతోంది. అన్నీ కుదిరితే అతి త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారమ్. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేస్తున్నాడు. అయితే, బాస్కర్ - అఖిల్ సినిమాపై కొంత గందరగోళం కన్పిస్తోంది.
హీరోయిన్ ఎవరన్నది ఇప్పటిదాకా కన్‌ఫామ్ కాలేదు. ఇంతలోనే అఖిల్ కొత్త సినిమాలపై ఊహాగానాలు విన్పిస్తుండడం గమనార్హం. మరోపక్క, ప్రశాంత్ వర్మ కోసం ఓ సీనియర్ హీరో ఆసక్తితో ఎదురుచూస్తున్నాడట. సో, ప్రశాంత్ వర్మ - అఖిల్ కాంబినేషన్‌పై ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి. అన్నట్టు, అఖిల్ ఇటీవలే ప్రశాంత్ వర్మని కలిశాడనీ, ప్రాజెక్ట్ పట్ల ఇద్దరూ సానుకూలంగా వున్నారనీ గుసగుసలు విన్పిస్తున్నాయి.