అదేంటో గానీ - అఖిల్ కి ఏదీ కలసి రాలేదు. స్టార్ కిడ్, పైగా అందగాడు. దానికి తోడు... అగ్ర నిర్మాణ సంస్థలన్నీ అఖిల్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాయి. అయినా సరే, హిట్టు పడలేదు. ఏరి కోరి ఫామ్ లో ఉన్న దర్శకుల్ని తీసుకొచ్చినా పని జరగలేదు. దాంతో అఖిల్ ఎంట్రీ కాస్త రీ ఎంట్రీ, రీ రీ ఎంట్రీలుగా మారిపోయి - సెటైర్లకు, ట్రోలింగులకు బోలెడంత ఆస్కారం ఇచ్చినట్టైంది. ఇప్పుడు అఖిల్ భవిష్యత్తంతా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` సినిమాపైనే ఆధారపడి ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి దర్శకుడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పాటికి ఈ సినిమా విడుదల అవ్వాల్సిందే.
కానీ లాక్ డౌన్ వల్ల కుదర్లేదు. కానీ గీతా ఆర్ట్స్ మాత్రం రిలీజ్ డేట్ విషయంలో ఏమాత్రం తొందర పడడం లేదు. దసరాకి లేదంటే సంక్రాంతికి.. ఎప్పుడైనా సరే, మంచి సీజన్‌లోనే విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఉంది గీతా ఆర్ట్స్. పైగా గీతా ఆర్ట్స్ మంచి ఫామ్ లో ఉంది. వరుసగా సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని తీస్తోంది. ఫ్లాప్ హీరోలతో సినిమాలు తీసినా హిట్లు కొడుతోంది. అందుకే... `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`పైనా మంచి అంచనాలే ఉన్నాయి. గీతా ఆర్ట్స్ అయినా... అఖిల్ గీత మారుస్తుందని అక్కినేని అభిమానులు సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు. లాక్ డౌన్ తో వచ్చిన విరామాన్ని ఈ సినిమా ఫైన్ ట్యూన్ చేయడానికి వాడుకుంటున్నార్ట అల్లు అరవింద్, భాస్కర్ అండ్ కో. ఏది ఏమైనా.. అఖిల్ ఓ హిట్టు కొడితే, పాత ఫ్లాపుల్నీ, ఈ సినిమా విడుదలలో జరిగిన జాప్యాన్ని అభిమానులు మర్చిపోతారు. గీతా ఆర్ట్స్ హిట్ రికార్డు మరింత మెరుగవుతుంది.