అక్కినేని అఖిల్ హీరోగా యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో ఈ మధ్య కొన్ని గాసిప్స్ హల్చల్ చేశాయి. అవేంటంటే దర్శకుడు వెంకీకి, అఖిల్‌కీ మధ్య ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయనీ, ఆ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది.
ఆ విషయంపై ఈ ఇద్దరూ స్పందించారు. స్పందించడమే కాదు, ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఇద్దరూ ఉన్నారు. ఫన్నీగా వీడియోని రూపొందించారు. ముందు నువ్వ మాట్లాడు అంటే, నువ్వు మాట్లాడు అంటూ ఇద్దరూ కాసేపు ఫన్ క్రియేట్ చేశారు. చివరికి మీరు హీరోలండీ ముందు మీరే మాట్లాడండి అంటూ వెంకీ చెప్పడంతో అఖిల్ అసలు విషయం స్టార్ట్ చేశాడు.
'వెంకీకి, నాకు క్రియేటివిటీ విషయంలో ఏవేవో గొడవలున్నాయంటూ ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన డైరెక్టర్ కాబట్టి ఆయన చెప్పిందే నేను చేస్తున్నాను. మా మధ్య గొడవలున్నాయన్న వార్తలు నిజమే అని చెప్పడానికే నేను ఈ వీడియో పోస్ట్ చేశాను ..' అని సీరియస్‌గా చెప్పేస్తుండగా, ఒక్కసారి ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు. వెనక నుండి స్టార్ట్స్ కెమెరా అని రావడం, వెంకీకి అఖిల్ ముద్దు పెట్టడం.. వెంకీ ఏం చేయాలో తెలియక అటూ ఇటూ చూడడం ఇదంతా చాలా ఫన్‌గా ఉంది.
మొత్తానికి ఈ వీడియో సారాంశం ఏంటంటే వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలూ లేవని చెప్పడానికే ఈ ఫన్నీ వీడియోను రూపొందించారన్నమాట. ఎలాగైతేనేం తమ సినిమా మీద వచ్చిన గాసిప్స్‌కి ఈ ఇద్దరూ బలే చెక్ పెట్టేశారు.