సినిమా టూ రాజకీయం..ఇదేం మన స్టార్లకు తెలియని విద్య కాదు. కాకపోతే కొంతమంది ముందు... ఇంకొంత మంది వెనుక. ఇప్పుడు అక్కినేని నాగార్జున కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. నాగార్జున- రాజకీయాలు అనే విషయంమీద గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమధ్య.. నాగ్ వైకాపాలో చేరబోతున్నట్టు విస్క్కృతంగా ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో నాగ్ సన్నిహితులు ఈ వార్తల్ని కొట్టి పారేశారు. కానీ ఇప్పుడు నాగ్ వైకాపాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈరోజు ఆయన వైఎస్ జగన్‌ని కలిసి, ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. అంతే కాదు.. గుంటూరు నుంచి ఎంపీ గా పోటీ చేయడానికి నాగ్ ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఆయన వైకాపా సానుభూతి పరుడిగా ఉన్నారు. అప్పట్లో వైఎస్ తో మంచి అనుబంధాలే ఉండేవి. తరచూ జగన్‌ని నాగార్జున కలిసేవారని చెప్పుకుంటుంటారు. కానీ జగన్ మనిషి అనే ముద్ర పడడానికి నాగ్ ఇష్టపడేవారు కాదు. ఇటు టీడీపీ తోనూ, అటు టీఎస్ఆర్‌తోనూ నాగార్జునకు సన్నిహిత సంబంధాలు ఉండేవి.
వాటిని దృష్టిలో ఉంచుకునే నాగ్ జాగ్రత్తగా వ్యవహరించేవారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై... నాగ్ సన్నిహితులు ఇప్పటి వరకూ స్పందించలేదు. అయితే మరో వర్గం మాత్రం గుంటూరు నుంచి ఎంపీ గా తన స్నేహితుడుని రంగంలోకి దింపడానికి నాగార్జున ప్రయత్నిస్తున్నారని, అందుకే తన స్నేహితుడి తరపున రాయబారం చేయడానికి జగన్‌ని కలిశారని చెబుతున్నారు. మరి ఇందులో నిజమేంటో నాగ్‌కే తెలియాలి.