వరుసగా మూడు ఫ్లాపులు వస్తే ఏ హీరో అయినా సరే, డల్ అయిపోవాల్సిందే. ఓ హిట్టు దర్శకుడ్ని ఎంచుకుని, హిట్ కాంబినేషన్‌ని సెట్ చేసుకుని, మినిమం గ్యారెంటీ ఉన్న కథతో ప్రయాణం చేయాలని చూస్తుంటారు. ప్రస్తుతం అఖిల్ పరిస్థితి అదే. అఖిల్, హలో, మజ్ను.. ఇలా మూడూ నిరాశ పరిచాయి. ఇలాంటి తరుణంలో ఓ హిట్టు అవశ్యం. నాగార్జున తలచుకుంటే, స్టార్ దర్శకులు అఖిల్‌తో సినిమా చేయడానికి రెడీ అయిపోతారు. కానీ అఖిల్ మాత్రం పోయి పోయి.. మరో ఫ్లాప్ దర్శకుడ్ని ఎంచుకున్నాడు. తనే.. బొమ్మరిల్లు భాస్కర్.
తొలి సినిమాతోనే తనపై అంచనాలు పెంచేసుకున్నాడు భాస్కర్. బొమ్మరిల్లు ఇచ్చిన సూపర్ సక్సెస్.. ఆ తరవాత భాస్కర్ కెరీర్‌లో కనిపించనేలేదు. పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త... ఇలా సినిమా సినిమాకీ తన రేంజ్ దిగుతూనే ఉంది. కొంతకాలంగా భాస్కర్‌ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు కూడా. భాస్కర్ అనే దర్శకుడు ఉండేవాడన్న సంగతి టాలీవుడ్ నిర్మాతలు, హీరోలూ క్రమంగా మర్చిపోతున్న తరుణంలో అఖిల్ 4వ సినిమాకి గానూ భాస్కర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసలే అఖిల్ ఫ్లాపులలో ఉన్నాడు.
ఇలాంటి సమయంలో రిస్కు తీసుకోవడం అవసరమా? అనిపిస్తోంది. కాకపోతే.. ఇది గీతా ఆర్ట్స్ తీయబోయే సినిమా. కథల విషయంలో గీతా ఆర్ట్స్ చాలా పక్కాగా ఉంటుంది. ఇటీవల గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా హిట్టే. దానికి తోడు... మెగా కాంపౌండ్ హీరోలతో కాకుండా బయటి హీరోలతో సినిమాలు తీసినప్పుడు గీతా ఆర్ట్స్ సక్సెస్ రేటు ఇంకా బాగుంది. అందుకే... అఖిల్ కూడా ధైర్యంగా ముందడుగు వేశాడని తెలుస్తోంది. మరి ఈ నిర్ణయం సరైనదేనా? లేదా? అనేది తెలియాలంటే ఈ సినిమా ఫలితం వచ్చేంత వరకూ ఎదురుచూడాల్సిందే.