కరోనాపై పోరాటం చేస్తున్న భారత ప్రభుత్వానికి తన వంతుగా రూ.25 కోట్ల విరాళాల్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు అక్షయ్ కుమార్. ఓ సినీ నటుడు ఈ స్థాయిలో విరాళం అందించడం గొప్ప విషయమే. ఇంత పెద్దంలో విరాళం అందించడం పట్ల సినీ, రాజకీయ వర్గాలు అక్షయ్‌ని అభినందనలతో ముంచెత్తుతున్నాయి. ఇంత పెద్ద మొత్తం అందించడం వెనుక స్ఫూర్తి ఏమిటని అక్షయ్‌ని అడిగితే.. చాలా ఆసక్తికరమైన విషయాల్ని బయటపెట్టాడు. తాను చిత్రసీమలోకి వచ్చినప్పుడు తన జేబులో కనీసం రెండొందలు కూడా లేవని, ఇప్పుడు చాలా డబ్బుందని, అదంతా చిత్రసీమే ఇచ్చిందని, తాను ఇప్పుడు తిరిగి ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నానని, అందుకే ఇస్తున్నానని వినమ్రంగా బదులిచ్చాడు.
తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నానని, అలాంటి సమయంలో ఎంతోమంది తనకు బాసట నిలిచారని, దేవుడు ఆదుకున్నాడని, అందుకు కృతజ్ఞత చూపించాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందని ఉద్వేగభరితంగా చెప్పాడు అక్షయ్ కుమార్. ''ఒకప్పుడు నా సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఏకంగా 14 సినిమాలు పరాజయం పొందాయి. ఆ సమయంలో అంతా అయిపోయిందనుకున్నాను.కానీ నా మార్షల్ ఆర్ట్స్ నాలో ధైర్యాన్ని నేర్పించాయి. ఇప్పుడు నా వరుస విజయాలకు ఆ పరాజయాలే కారణం'' అంటూ చెప్పుకొచ్చాడు అక్షయ్.