అటు బాలీవుడ్‌నే కాదు, ఇటు దక్షిణాదినీ కంగారు పెడుతోంది 'మీటూ' ఉద్యమం. తమపై జరిగిన, జరుగుతున్న లైంగిక వేధింపులపై కథానాయికలు, గాయనీమణులు గళం విప్పుతుండడంతో - ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందో తెలీక టెన్షన్ పడుతున్నారు.
హీరోలు సైతం 'మీటూ'పై స్పందించక తప్పడం లేదు. 'మీటూ' ఉద్యమంలో పాల్గొంటున్నవాళ్లందరికీ తమ సానుభూతి తెలపడంతో పాటు, అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. తన తాజా చిత్రం 'హౌస్ ఫుల్ 4' షూటింగ్‌ని అర్థాంతరంగా నిలిపివేశాడు.
దానికి కారణం 'హౌస్ ఫుల్ 4' దర్శకుడు సాజిద్ ఖాన్ లైంగిన వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీనిపై విచారణ జరిగి, నిజానిజాలు తెలిసేంత వరకూ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పేశాడు అక్షయ్. ''ఒకవేళ ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడినట్టు రుజువైతే, వాళ్లతో నేను ఎట్టిపరిస్థితుల్లోనూ పనిచేయను. ఇలాంటి కఠినమైన చర్యలు, నిర్ణయాలు తీసుకోవడం ఈ పరిస్థితుల్లో చాలా అవసరం'' అని అక్షయ్ ట్వీట్ చేశాడు.
అక్షయ్ నిర్ణయం అందరినీ విస్మయపరిచేదే. కాకపోతే.... ఇలాంటి నిర్ణయాలే 'మీటూ' ఎంత శక్తిమంతంగా తయారవుతుందో చెబుతున్నాయి. అక్షయ్ కుమార్ బాటలో మిగిలినవాళ్లూ నడిస్తే.. మరింత సంచలనం తప్పకపోవొచ్చు.