మీటూ ప్రభంజనం సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ప్రతి రోజూ కుప్పలు తెప్పలుగా 'మీటూ' సంచనాలు తెరపైకొస్తున్నాయి. ప్రధానంగా బాలీవుడ్ ఈ మీటూ ప్రకంపనలకు విలవిల్లాడుతోంది. ఆ తర్వాతి స్థానం తమిళ సినీ పరిశ్రమదే. నానా పటేకర్, అలోక్‌నాథ్ వంటి నటులు 'మీటూ' వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే.
వీరిపై తాజాగా ఆరోపణలు చేస్తూ మరికొందరు బాధితులు మీడియా ముందుకొస్తున్నారు. అదలా వుంచితే, తమిళ సినీ ప్రముఖుడు వైరముత్తుపై గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే. ఈ ఆరోపణలపై వైరమత్తు తాజాగా స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల్ని ఆయన కొట్టి పారేశారు. కొందరు బ్లాక్‌మెయిలింగ్ చర్చలకు పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు. 'నేనెలాంటివాడినో నాకు తెలుసు.. నాతోపాటు అందరికీ తెలుసు. కొందరు మాత్రమే నాపై పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారు.. బ్లాక్‌మెయిలింగ్‌కి తలొగ్గను..' అని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, 'మీ..టూ..' అనేది చాలా గొప్ప ఉద్యమం అనీ, దాని పేరుతో కొందరు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆధారాల్లేని ఆరోపణలతో, వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నది ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు, వారి మద్దతుదారులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.
నానా పటేకర్, అలోక్ నాథ్ కూడా ఇదే అభిప్రాయంతో వున్నారు. నిజమైన లైంగిక వేధింపుల బాధితులకు న్యాయం జరగాలని తాము కూడా డిమాండ్ చేస్తామనీ, వారి పోరాటానికి మద్దతు ఇస్తామనీ, అయితే దుష్ప్రచారం చేసి పబ్లిసిటీ పొందాలనుకునేవారి ఆటలు మాత్రం చెల్లవని ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో కొందరు చెబుతుండడం గమనించాల్సిన విషయం.