బన్నీ దెబ్బకి బాక్సాఫీస్‌ బద్దల్‌!

మరిన్ని వార్తలు

బాక్సాఫీస్‌లన్నీ బద్దలుకొట్టేస్తున్నాడు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. సంక్రాంతి రేస్‌లో రెండవ సినిమాగా విడుదలైన 'అల వైకుంఠపురములో..' సినిమా బాక్సాఫీస్‌కి కాసుల పంట పండిస్తోంది. సంక్రాంతికి అసలు సిసలు సినిమాగా రికార్డులు కొల్లగొట్టేస్తోంది. తెలుగు రాష్ట్రాల సంగతి అటుంచితే, ఓవర్సీస్‌లోనూ బన్నీ రికార్డుల మోత మోగించేస్తున్నాడు. అంతకు ముందే రిలీజైన 'సరిలేరు..' రికార్డుల్ని బన్నీ క్రాస్‌ చేశాడని ట్రేడ్‌ పండితులు లెక్కలతో సహా చూపించేస్తున్నారు. ఇక న్యూజిలాండ్‌లో 'అల వైకుంఠపురములో..' రికార్డులు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

 

ఇంతవరకూ ఏ తెలుగు సినిమాకీ రానంత భారీ ఓపెనింగ్స్‌ దక్కించుకుంది న్యూజిలాండ్‌లో 'అల..' సినిమా. బాహుబలి రికార్డుల్ని అక్కడ 'అల..' కొట్టేసిందని చెబుతున్నారు. ఇక ఓవర్సీస్‌ రారాజు అయిన మహేష్‌ రికార్డుల్ని బన్నీ మొదటి రోజే క్రాస్‌ చేయడం అందరికీ షాక్‌ ఇస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే, ఇంకా ముందుంది అసలు పండగ. పండగ సెలవులు.. ఇప్పుడే స్టార్ట్‌ అయ్యాయి. పండగలో బన్నీ ఎలా దుమ్ము రేపనున్నాడో చూడాలిక. మహేష్‌, బన్నీ సంగతిలా ఉంటే, ఈ రెండింటి ధాటిని తట్టుకుని మరో రెండు రోజుల్లో రాబోయే 'మంచోడు' కళ్యాణ్‌ రామ్‌ సంగతి ఎలా ఉండబోతోందో.

 

ఇంతవరకూ ధీమాగా ఉన్న 'మంచోడు..' టీమ్‌లో టెన్షన్‌ స్టార్ట్‌ అయ్యిందట. కానీ, సంక్రాంతి సీజన్‌ ఎన్ని సినిమాల తాకిడినైనా తట్టుకోగలదు. బోణీ బొమ్మ దద్దరిల్లింది కాబట్టి, నందమూరి హీరో కూడా నిలబడగలడేమో చూడాలి. మొత్తానికి ఈ సంక్రాంతి సినీ ప్రియుల్ని సూపర్బ్‌గా శాటిస్‌ఫై చేసిందనే చెప్పాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS