'అల వైకుంఠపురములో..' మూవీ రివ్యూ రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : అల్లు అర్జున్, పూజ హెగ్డే, టబూ, నివేత పెత్తురాజ్, సుశాంత్ తదితరులు 
దర్శకత్వం :  త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత‌లు: అల్లు అరవింద్, రాధా కృష్ణ
సంగీతం : థమన్
సినిమాటోగ్రఫర్: పి.ఎస్. వినోద్ 
ఎడిటర్: నవీన్ నూలి

 

రేటింగ్‌: 3/5

 

తెలుగు చిత్ర‌సీమ‌లో విజ‌య‌వంత‌మైన కాంబినేష‌న్‌ల‌లో హీరో అల్లు అర్జున్, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ల జోడి  ఒక‌టి. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన జులాయి,స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి పెద్ద విజ‌యాల్ని సాధించాయి. కొంత విరామం త‌ర్వాత అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ క‌లిసి చేసిన సినిమా అల వైకుంఠ‌పుర‌ములో.  గ‌త కొంత‌కాలంగా సీరియ‌స్ క‌థాంశాల‌తో సినిమాలు చేస్తూ వ‌చ్చిన అల్లు అర్జున్ వినోదాప్ర‌ధాన క‌థాంశాన్ని ఎంచుకొని చేసిన సినిమా ఇది. అలాగే ద‌ర్శ‌కుడిగా త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల్ని నిరూపించుకోవాల‌నే త‌ప‌న‌తో త్రివిక్ర‌మ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. త‌మ‌న్ స్వ‌ర‌ప‌ర‌చిన పాట‌లు పెద్ద విజ‌యాన్ని సాధించ‌డం, సంక్రాంతి పోటీలో నిల‌వ‌డంతో ఈసినిమాపై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.  ఆ అంచ‌నాల్ని ఈసినిమా అందుకుందా?బ‌న్నీ, త్రివిక్ర‌మ్ జోడి  ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్‌ను అందుకుందా లేదా అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే..

 

*క‌థ

 

ఏఆర్ కే కంపెనీలో రామచంద్ర(జయరాం), వాల్మికి (మురళీశర్మ) గుమాస్తాలుగా జీవితాన్ని  ప్రారంభిస్తారు. ఏఆర్ కె కంపెనీ అధినేత(సచిన్ ఖేడ్కర్) కూతురును(టబు) పెళ్లిచేసుకొని జయరాం కోటీశ్వరుడిగా మారిపోతాడు. దాంతో అతడిపై ధ్వేషం పెంచుకుంటాడు వాల్మికి. ఒకే హాస్పిటల్ లో రామచంద్ర, వాల్మికిలకు పిల్లలుపుడతారు. రామచంద్రపై కోపంతో  ఓ నర్సు సహాయంతో ఆ పిల్లల్నితారుమారు చేస్తాడు వాల్మికి. రామచంద్రం కొడుకు బంటు(అల్లు అర్జున్ )వాల్మికి దగ్గర, వాల్మికి కొడుకు రాజ్ మనోహర్(సుశాంత్) రామచంద్ర దగ్గ‌ర‌పెరుగుతారు. రామచంద్రపై కోపాన్ని ప్రతి క్ష‌ణం త‌న కొడుకు బంటుపై ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటాడు వాల్మికి.  తండ్రిని మెప్పించ‌డానికి అనుక్ష‌ణం బంటు త‌ప‌న ప‌డుతుంటాడు. ఓ టూర్ కంపెనీలో ఉద్యోగంలో చేరిన బంటు  ఓన‌ర్ అమూల్య‌తో(పూజాహెగ్డే) ప్రేమ‌లో ప‌డ‌తాడు.

 

ఈ క్రమంలో ఓ ప్ర‌మాదం బారి నుంచి రామ‌చంద్ర‌ను ర‌క్షించిన బంటుకి అత‌డే త‌న తండ్రి అనే నిజం తెలుస్తుంది. ఆ త‌ర్వాత బంటు ఏం చేశాడు. అప్ప‌ల‌నాయుడు(సముద్రఖని) అనే రౌడీ కార‌ణంగా స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న రామ‌చంద్రం కుటుంబానికి ఎలా అండ‌గా నిలిచాడు?   బంటి త‌న కొడుకు అనే నిజం రామ‌చంద్రం తెలుసుకున్నాడా?  త‌ను ప్రేమించిన అమూల్య‌ను బంటు పెళ్లిచేసుక‌న్నాడా అన్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం. 

 

*విశ్లేష‌ణ‌


ఓ వ్య‌క్తికి స్థానాన్ని ఇవ్వ‌గలం కానీ స్థాయిని ఇవ్వ‌లేం అనే పాయింట్‌ప్రధానంగా తీసుకొని త్రివిక్ర‌మ్ ఈసినిమాను తెర‌కెక్కించారు.  ఓ పేదింటి బిడ్డ ధ‌న‌వంతుల ఇంటిలో, గొప్పింటి వార‌సుడు పేద‌వాడిగా పెర‌గ‌డం అనే పాయింట్ కొత్త‌దేమీ కాదు. ఈ రొటీన్ పాయింట్‌కు త‌న‌దైన శైలి భావోద్వేగాలు, వినోదంతోపాటు మాస్ మసాలా హంగుల్ని ద‌ట్టించి ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ క‌థ‌ను ర‌క్తిక‌ట్టించారు. క‌థ క‌థ‌నాల కంటే బ‌న్నీ అభిమానుల్ని మెప్పించ‌డంపైనే దృష్టిపెట్టిన త్రివిక్ర‌మ్ ఆ ప్ర‌య‌త్నంలో పూర్తిగా స‌ఫ‌ల‌మ‌య్యారు. హీరోయిజాన్ని ఆవిష్క‌రిస్తూనే ప్ర‌తి సీన్ నుంచి కావాల్సినంత హీరోయిజం వినోదాన్ని రాబ‌ట్టారు.

వాల్మికి పిల్ల‌లు మార్చే క‌థ‌నం, వాటి తాలూకు ఎపిసోడ్‌తో క‌థ‌నుఆసక్తికరంగా మొద‌లుపెట్టారు ద‌ర్శ‌కుడు.   ఆ త‌ర్వాత   తండ్రి కార‌ణంగా బంటు ప‌డే క‌ష్టాల‌న్నీ వినోదాన్ని పంచుతాయి. అమూల్యతో ప్రేమాయ‌ణం స‌ర‌దాగా సాగుతుంది.   నిజం చెప్ప‌డం కూడా రాని కొడుకు కార‌ణంగా ముర‌ళీశ‌ర్మ ప‌డే అవ‌స్థ‌లు, బంటును ఏడిపించ‌డానికి అమూల్య చేసేప‌నుల‌న్నీ ఆహ్లదభరితంగా సాగుతాయి.  వాటికి స‌మాంత‌రంగా అప్ప‌ల‌నాయుడు కార‌ణంగా రామ‌చంద్రం అతడి కుటుంబం ప‌డే అవ‌స్థ‌ల్ని చూపించారు.  రామ‌చంద్రం త‌న తండ్రి అని బంటు తెలుసుకునే మ‌లుపు బాగుంది. త‌న కుటుంబం కాపాడుకోవ‌డానికి బంటు ప‌డే వేద‌న‌, పోరాటంతో ద్వితీయార్థం భావోద్వేగ‌భ‌రితంగా మ‌లిచారు. త‌ల్లిదండ్రుల మ‌ధ్య ఉన్న మ‌న‌స్ప‌ర్థ‌లు తొల‌గిపోవ‌డానికి బంటు చేసే ప్ర‌య‌త్నాల  స‌హ‌జంగా తీర్చిదిద్దారు. తల్లిదండ్రులు కళ్ల ఎదురుగా ఉన్న వారికి అలా పిలవకుండా బంటుపడే సంఘర్షణ మనసుల్ని హత్తుకుంటుంది. ప‌తాక ఘ‌ట్టాల్ని రొటీన్‌కు భిన్నంగా జాన‌ప‌ద గేయాన్ని యాక్ష‌న్ స‌న్నివేశంతో ముడిపెట్టి న‌డిపించడం కొత్త‌గా ఉంది.

 

*న‌టీన‌టులు

 

బ‌న్నీ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో క‌నిపించి చాలాకాల‌మైంది. ఆ లోటును త్రివిక్ర‌మ్ ఈసినిమాతో తీర్చారు. జులాయి త‌ర‌హాలో స‌ర‌దాగా అత‌డి పాత్ర‌ను ఆవిష్క‌రిస్తూనే ప‌రిణితితో అతడి పాత్రను  తీర్చిదిద్దారు దర్శకుడు.  బన్నీ నుంచి అభిమానులు కోరుకునే హంగుల్ని జోడించారు. ద్వితీయార్థంలో చిరంజీవి, మ‌హేష్‌, ఎన్టీఆర్ పాట‌ల‌కు బ‌న్నీ చేసే పేర‌డీ డ్యాన్సులు ఫ్యాన్స్ ను మెప్పిస్తాయి.

 

త‌న కుటుంబం కోసం అనుక్ష‌ణం త‌పించే కొడుకుగా, హుషారైన యువ‌కుడిగా భిన్న పార్శాల‌తో కూడిన పాత్ర‌లో ఒదిగిపోయాడు బ‌న్నీ.  పంచ్‌లు, ప్రాస‌ల‌తోఅత‌డి పాత్ర చలాకీగా సాగుతుంది. చాలా కాలం త‌ర్వాత ఈసినిమాతో తెలుగులో పున‌రాగ‌మ‌నం చేసింది ట‌బు. ఆమె పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోయినా క‌నిపించిన రెండు స‌న్నివేశాల్లో తన అనుభవంతో ఆకట్టుకుంటుంది.  హుందాగా ఆమె పాత్ర‌ను ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దారు. మ‌ల‌యాళ న‌టుడు జ‌య‌రాం భావోద్వేగ‌భ‌రిత పాత్ర‌లో చ‌క్‌సటి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు.  రామ‌చంద్రం పాత్ర‌లో పూర్తిగా ఒదిగిపోయారాయన. అమూల్యగా పూజాహెగ్డే గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకున్న‌ది. సుశాంత్ పాత్రకు ప్రాముఖ్య‌త లేదు. స్వార్థ మ‌న‌స్త‌త్వం క‌లిగిన వ్య‌క్తి ముర‌ళీశ‌ర్మ విభిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించారు. విల‌క్ష‌ణ మేజ‌రిజమ్స్ తో డైలాగ్స్ చెబుతూ సాగే అత‌డి పాత్ర ఆస‌క్తిని పంచుతుంది. విల‌న్‌గా స‌ముద్ర‌ఖ‌ని మెప్పించారు.

 

*సాంకేతిక‌త‌

 

ద‌ర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ క‌థ‌, క‌థ‌నాలంటే బ‌న్నీ ఇమేజ్‌, సంభాష‌ణ‌లు, పాట‌ల్ని న‌మ్ముకొనియఈసినిమాను తెర‌కెక్కించిన‌ట్లుగా అనిపించింది. ద‌ర్శ‌కుడిగా అత‌డి ప్ర‌తిభ‌ను చాటిచెప్పే స‌న్నివేశాలు పెద్ద‌గా లేవు. 
అప్పడాలే  కాదు చెప్పడాలు ఉండాలంటూ త‌న‌దైన శైలి సంభాష‌ణ‌ల‌తో అల‌రించారు. త‌మ‌న్ సంగీతం ఈసినిమాకు పెద్ద‌బ‌లంగా నిలిచింది. పామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌, రాములో రాములా పాట‌లు  అల‌రిస్తాయి. ఆ పాట‌ల్ని తెర‌పై అందంగా చిత్రీక‌రించారు ఛాయాగ్రాహ‌కుడు పి.ఎస్‌. వినోద్‌. క‌థ‌ను న‌మ్మి భారీగా అల్లు అర‌వింద్‌, రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.  అల వైకుంఠ‌పుర‌ములో సంక్రాంతికి అస‌లైన సినిమాగా నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహంలేదు.

 

*ప్ల‌స్ పాయింట్స్‌

అల్లు అర్జున్ న‌ట‌న‌
వినోదం, 
పాట‌లు
 

*మైన‌స్ పాయింట్స్‌

క‌థ‌, క‌థ‌నాల్లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం
ద్వితీయార్థం
సాగ‌తీత‌గా అనిపించే స‌న్నివేశాలు

*ఫైన‌ల్ వర్డిక్ట్‌: పండగ లాంటి సినిమా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS