అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చి రెండేళ్లయ్యింది. ఇప్పుడు ఈ సినిమాని హిందీ లో డబ్ చేసి విడుదల చేస్తున్నట్టు... ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ని సొంతం చేసుకున్న గోల్డ్ మైల్ సంస్థ ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఈ సినిమా రీమేక్ రైట్స్ ఎప్పుడో అమ్మేశారు. హిందీలో ఈ సినిమాని షెహజాదా పేరుతో రీమేక్ చేస్తున్నారు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయ్యింది. ఇలాంటి సమయంలో.. హిందీ డబ్బింగ్ ని ఎలా విడుదల చేస్తారని షెహజాదా నిర్మాతలు కంగారు పడ్డారు.
ఇప్పుడు గోల్డ్ మైన్ సంస్థకీ, షెహజాదా నిర్మాతలకూ మధ్య రాజీ కుదిరింది. అందుకే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రిలీజ్ ని ఆపేశారు. ఈ మేరకు గోల్డ్ మైన్ పిక్చర్స్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. హిందీ డబ్బింగ్ వెర్షన్ ని విడుదల చేయడం లేదని ప్రకటించింది. అడిగిన వెంటనే `అల వైకుంఠపురములో` హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ ని నిలిపి వేసినందుకు `షెహజాదా` మేకర్స్ గోల్డ్ మైన్ పిక్చర్స్ అధినేత మనీష్ షా కు కృతజ్ఞతలు తెలిపారు. దాంతో ఈ వివాదం సమసిపోయినట్టైంది