ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అతి పెద్ద హిట్ సినిమా ‘అల వైకుంఠపురములో’. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్ సినిమా. ఆ మాటకొస్తే, ‘బాహుబలి’ తర్వాత వసూళ్ళ పరంగా రెండో స్థానంలో నిలిచిన సినిమా ఇది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్దే కాంబినేసన్‌లో రూపొందిన ‘అల వైకుంఠపురములో’ దియేటర్లలోనే కాదు, బుల్లితెరపైనా సంచలనాలకు సిద్ధమవుతోంది. వెండితెరపై సంచలన విజయాన్ని అందుకున్న ‘అల వైకుంఠపురములో’, బుల్లితెరపై ‘టీఆర్పీ’ రేటింగ్ పరంగా ఏ స్థాయి సంచలనం సృష్టించనుందన్న చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ టెలివిజన్ ప్రీమియర్ రేటింగ్స్ వచ్చాయి.
‘బాహుబలి’ని దాటి నెంబర్ వన్ పొజిషన్‌లోకి చేరుకుంది ‘సరిలేరు నీకెవ్వరు’ టీఆర్పీ రేటింగ్ పరంగా. వసూళ్లలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాని సులువుగా దాటేయడమే కాదు, భారీ మార్జిన్ దక్కించుకున్న ‘అల వైకుంఠపురములో’, టెలివిజన్ స్క్రీన్‌పై ఏ మేరకు సత్తా చాటుతుందన్నది ప్రస్తుతానికైతే మిలియన్ డాలర్ల ప్రశ్నే. అల్లు అర్జున్ అభిమానులు మాత్రం, ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అత్యధిక టీఆర్పీ తమకే సొంతమవుతుందనే ఆశాభావంతో వున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కి సంబంధించి, ‘అల వైకుంఠపురములో’ సినిమాకి సంబంధించి ఏ చిన్న విషయం బయటకొచ్చినా హ్యాష్ ట్యాగ్‌లతో ట్రెండింగ్ చేసే బన్నీ అభిమానులూ, ఇప్పుడే అదే పనిలో బిజీగా వున్నారు.