పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వీరూపాక్ష అనే పేరు పరిశీలిస్తున్నారు. ఏ.ఎం.రత్నం తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం వంద కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ యేడాదే ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది చిత్రబృందం ప్లాన్. కానీ ముందు నుంచీ ఈసినిమాకి అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నాయి. లాక్ డౌన్ వల్ల... షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. లాక్ డౌన్ తరవాత కూడా ఈ సినిమా షూటింగ్ సజావుగా సాగే అవకాశాలు కనిపించడం లేదు. లాక్ డౌన్ ఎత్తేసినా సరే, సినిమా షూటింగులో పాల్గొనడం తనకు కుదరకపోవొచ్చని క్రిష్ బృందానికి పవన్ సూచన ప్రాయంగా చెప్పాడట. దానికి కారణం `వకీల్ సాబ్`. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన పింక్ చిత్రానికి ఇది రీమేక్.
మేలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అయితే లాక్ డౌన్ వల్ల ఈ సినిమా విడుదల డైలామాలో పడింది. ఈనెల 14తో లాక్ డౌన్‌తో ఎత్తేసే అవకాశాలున్నాయి. ఆ తరవాత షూటింగులు మొదలవుతాయి. ముందు వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసిన తరవాతే .. క్రిష్ సినిమా మొదలెట్టాలని పవన్ భావిస్తున్నాడు. లాక్ డౌన్ ఎత్తేసి, షూటింగులు మొదలైతే, 20 రోజుల పాటు ఏకధాటిగా వకీల్ సాబ్‌కి పవన్ డేట్లు ఇవ్వబోతున్నాడట. ఆ తరవాతే క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడట. దాంతో క్రిష్ బృందం డైలామాలో పడింది. లాక్ డౌన్ తరవాత పవన్ వచ్చేస్తాడని, షూటింగు మొదలెట్టుకోవచ్చని అంచనా వేసిన క్రిష్ బృందం ఇప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాల్సిందే.