పవన్ కల్యాణ్ - అలీల మైత్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ''అలీ లేకుండా నా సినిమా ఉండదు'' అని పవన్ స్వయంగా చెప్పడం.. వీరిద్దరి బంధానికి ప్రతీక. అలీ కూడా పవన్ గురించి గొప్పగానే చెప్పుకొచ్చేవాడు. అయితే ఇదంతా గతం. వీరిద్దరి మధ్య రాజకీయపరమైన గ్యాప్ ఉంది. ఈ విషయాన్ని పవన్ అభిమానులు కూడా అంగీకరిస్తారు. అలీ లేకుండా నా సినిమాలు ఉండవు అన్న పవన్... ఇప్పుడు అలీని దూరం పెట్టాడు. అలీ కూడా.. పవన్ గురించి మాట్లాడడం బాగా తగ్గించేశాడు. ఓ రాజకీయ సభలో.. పవన్ పై ప్రత్యక్షంగానే సెటైర్లు వేశాడు అలీ. తను పవన్ కంటే సీనియర్ అని చెప్పుకొచ్చాడు. ఇటీవలే అలీ కూతురి వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కనిపించలేదు. దాంతో వీరిద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగిపోయిందనుకొన్నారంతా. అయితే.. ఇప్పుడు అలీ.. పవన్‌కి మళ్లీ దగ్గరవ్వాలని చూస్తున్నాడు. అందుకే పదే పదే.. పవన్ పేరు ప్రస్తావిస్తున్నాడు. తన కూతురి పెళ్లికి పవన్ రాకపోవడం వెనుక ఉన్న మిస్టరీ బయటపెట్టాడు అలీ.
తాను పవన్‌ని పెళ్లికి పిలిచినట్టు, పవన్ కూడా వస్తా అని చెప్పినట్టు స్పష్టం చేశారు. కానీ చివరి నిమిషంలో ఫ్లైట్ మిస్ అయ్యిందని, అందుకే పవన్ రాలేకపోయారని క్లారిటీ ఇచ్చాడు అలీ. ''పవన్‌కీ నాకూ మధ్య గ్యాప్ రాలేదు. కొంతమంది కావాలని సృష్టించారంతే. పెళ్లి శుభలేఖ నేనే స్వయంగా తీసుకెళ్లి పవన్ కి ఇచ్చా. ఆయన చాలా సాదరంగా ఆహ్వానించారు. పెళ్లికి వస్తా అని మాట ఇచ్చారు. ఆ రోజు డేట్ కూడా నా కోసం అట్టి పెట్టారు. కానీ.. చివరి నిమిషంలో ఫ్లైట్ మిస్ అయ్యింది. అందుకే రాలేకపోయారు'' అంటూ పవన్ పెళ్లికి రాలేకపోవడం వెనుక అసలు కారణం చెప్పుకొచ్చాడు అలీ.