వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు రవితేజ. 2022 తనకు ఏమాత్రం కలసి రాలేదు. ఈ యేడాది రెండు సినిమాలొస్తే.. రెండూ ఫ్లాపులే. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా విడుదల అవుతోంది. అదే ధమాకా. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 23న వస్తోంది. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా అటూ ఇటూ అయితే రవితేజ కెరీర్ అతలాకుతలం అవ్వడం ఖాయం.
ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చేసింది. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. కాకపోతే.. రవితేజలు ఇద్దరా? ఒక్కడే ఇద్దరిలా నటిస్తున్నాడా? అనేదే ఈ సినిమాలో అసలు సిసలైన ట్విస్టు. అది చివర్లో రివీల్ అవుతుందని టాక్. ఫస్టాఫ్ ఫన్ రైడ్‌గా సాగిపోతుందట. వింటేజ్ రవితేజని ఈ సినిమాలో చూడబోతున్నామని తెలుస్తోంది. శ్రీలీలతో రవితేజ నడిపే రెండు లవ్ ట్రాకులు కూడా బాగా పండాయని, ముఖ్యంగా పాటలు అదిరిపోయాయని సమాచారం.
జింతాత.. పాట సెకండాఫ్‌లో కీలకమైన పొజీషన్లో వస్తుందని ఆ పాటకు థియేటర్ దద్దరిల్లుతుందని తెలుస్తోంది. రావు రమేష్ - హైపర్ ఆదిల ట్రాక్ హిలేరియస్‌గా పండిందట. ఈ సినిమా హైలెట్స్ లో ఇదొకటని సమాచారం. సెకండాఫ్ మొత్తం కథ నడుస్తుందని, అక్కడ ఫన్ కొంచెం మిస్ అయ్యిందని చెబుతున్నారు. సెకండాఫ్‌లో వచ్చే డ్రామా రక్తి కడితే.. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయమన్నది సెన్సార్ రిపోర్ట్.