ఆలియా భట్- ఇప్పుడు బాలీవుడ్ లో ఈ పేరు ఒక సంచలనమనే చెప్పాలి. కథ, పాత్ర ఎటువంటిదైన ఆమె అందులోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేయగలదు అని ఇప్పుడు అందరూ వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.
ఇక తాజాగా ఆలియా భట్ చేసిన చిత్రం రాజీ. ఈ చిత్రంలో సెహమత్ అనే ఒక నిజ జీవిత పాత్రలో నటించింది ఆలియా. ఇక భారతదేశం నుండి గూడచర్యం చేయడానికి ఒక పాకిస్తానీ మిలిటరీ అధికారాని వివాహం చేసుకుని అక్కడి సమాచారాన్ని ఇక్కడకి చేరవేసే పాత్రలో ఆలియా అద్భుతంగా నటించింది.
అయితే నిజజీవితంలో సెహమత్ ఎక్కడ ఉంది? ఆమె ఎలా ఉంది? అన్న సమాచారం ఎవ్వరికీ తెలియనివ్వద్దు అని జమ్మూ కాష్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఈమె జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన హరీందర్ కి విజ్ఞప్తి చేశారు.
ఆయన తన లేఖలో- నువ్వు పదేళ్ళ క్రితం తొలిసారిగా ఈ కథనం ప్రచురించినప్పుడు సెహమత్ వివరాలు గోప్యంగా ఉంచమని చెప్పా.. అది నువ్వు పాటించావు.. ఇక ఇప్పుడు ఆమె పైన ఏకంగా ఒక సినిమానే వచ్చాక, కచ్చితంగా ఆమె గురించిన వివరాల కోసం చాలా మంది ప్రయత్నిస్తారు. అందుకనే నువ్వు ఈ విషయంలో ఇంకా గోప్యత పాటించాలి అని సూచన కూడా చేశారు.
ఏదేమైనా.. ఈ అంశం ఎలా ఉన్నా.. ఆలియా భట్ మాత్రం తన జీవితంలో ఎప్పటికి గుర్తుపెట్టుకునే ఒక పాత్రని పోషించింది.