అలియా అలిగింది. మామూలుగా కాదు. తాను... నటించిన సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంటే, ఆ సినిమా గురించి ఒక్క పోస్ట్ కూడా చేయనంతగా అలిగింది.
ఆర్.ఆర్.ఆర్‌లో అలియా కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన దగ్గర్నుంచి.. అలియా నుంచి ఎలాంటి హడావుడీ లేదు. సాధారణంగా సినిమా హిట్టయితే ఆ చిత్రబృందం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. విడుదలకు ముందు నుంచీ వరుసగా పోస్ట్ లు చేస్తుంటారు. అలియా అసలు ఆ మాటే ఎత్తలేదు. ఆర్.ఆర్.ఆర్ రెండో దఫా ప్రమోషన్లలోనూ అలియా కనిపించలేదు. ఒక్క ధిల్లీ ప్రెస్ మీట్ లో మాత్రమే అలియాని చూసే అవకాశం దక్కింది. ఇప్పుడు ఇన్‌స్టాలో రాజమౌళి ఎకౌంట్ ని అన్ ఫాలో చేసిందని, గతంలో `ఆర్.ఆర్.ఆర్`పై పెట్టినపోస్టులన్నీ తొలగించిందని వార్తలొస్తున్నాయి.
అలియా ఇంతలా అలగడానికి కారణం కూడా ఉంది. ఆర్.ఆర్.ఆర్‌లో అలియా స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. మహా అయితే... 10 నిమిషాల లోపే ఉంటుంది. ఆమాత్రం దానికి అలియాని తీసుకోవాలా? అనే ప్రశ్న చాలామందికి ఎదురైంది. అయితే... అలియాకు కథ చెప్పేటప్పుడు మాత్రం తన పాత్రకు ఎలివేషన్లు ఇచ్చుకుంటూ పోయాడట రాజమౌళి. పైగా అలియా ఇంట్రడక్షన్ లో ఓ పాట కూడా ఉందట. రామ్ చరణ్‌తో కలిసి ఓ డ్యూయెట్ కూడా ప్లాన్ చేశాడట. ఇవన్నీ ఉండి ఉంటే... అలియా స్క్రీన్ టైమ్ కనీసం 30 నిమిషాలైనా ఉండేది. ఇప్పుడు అదంతా ఎగిరిపోయింది. అలియాతో సోలో, డ్యూయెట్ సాంగ్స్ ఉన్నాయన్న సంగతి కూడా ఎవ్వరికీ తెలీదు. ఆ పాటల్ని తెరకెక్కించి కూడా పక్కన పెట్టేశారని టాక్.
ఢిల్లీ ప్రెస్ మీట్లో `ఆ రెండు పాటల సంగతి ఏమిటి?` అని రాజమౌళిని అలియా అడిగిందని, రన్ టైమ్ వల్ల ఆ పాటల్ని ఎడిట్ చేశారని రాజమౌళి చెప్పడంతో నిరాశ చెందిందని, అందుకే... ఆర్.ఆర్.ఆర్ గురించి మాట్లాడడానికి గానీ, పోస్ట్ పెట్టడానికి గానీ ఇష్టపడలేదని సమాచారం.
ఇవన్నీ చూస్తుంటే అలియా అలగడానికి కారణం ఉంది.అనిపిస్తోంది. మరి అజయ్ దేవగణ్ సంగతేంటో? ఆయన్నుంచి కూడా ఈ సినిమా గురించి ఎలాంటి ట్వీటూ లేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రమోషన్లలోనూ కనిపించలేదు. అజయ్ పాత్ర స్ట్రాంగ్‌గానే చూపించాడు రాజమౌళి. కథలో కూడా అంతకు మించిన ప్రాధాన్యం ఆ పాత్రకు లేదు. కథ విన్నప్పుడే తన స్క్రీన్ టైమ్ గురించి అజయ్‌కి అర్థమైపోయి ఉంటుంది. అయినా ఒప్పుకొన్నాడు కదా? మరి... ఆయన అలగడంలో అర్థమేమిటో?