డిమాండ్ ని బట్టే సప్లయ్. హిట్టుని బట్టే పారితోషికం. ఈ విషయంలో మరో మాటే లేదు. ఒక్క హిట్టు చాలు. పారితోషికాన్ని డబుల్ చేసేయ్యడానికి. అల్లు అర్జున్‌కి ఆ అవకాశం వచ్చింది. `పుష్ప`తో. ఈ సినిమాతో బన్నీ తనరేంజ్ చూపించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేసింది. ఒక్కబాలీవుడ్ లోనే వంద కోట్లు రాబట్టింది. `పుష్ప` రిజల్ట్ అటు బాలీవుడ్ కీ షాకింగే. బాలీవుడ్ సినిమాలు బోల్తా పడిన చోట.. ఓ డబ్బింగ్ బొమ్మ వంద కోట్లు వసూలు చేయడం... సమ్ థింగ్ స్పెషల్ గా నిలిచింది. ఆ ఎఫెక్ట్ తో నే `అల వైకుంఠపురములో` సినిమాని సైతం ఇప్పుడు డబ్ చేసి విడుదల చేస్తున్నారు.
ఈ హిట్టుతో బన్నీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దాంతో పాటు పారితోషికం కూడా. నిన్నా మొన్నటి వరకూ బన్నీ పారితోషికం రూ.25 నుంచి రూ.30 కోట్ల లోపే. అయితే.. పుష్ప హిట్టుతో తన పారితోషికాన్ని రూ.70 కోట్లకు పెంచేశాడట. అంటే... రెండు రెట్లకంటే ఎక్కువ. అయినా సరే, నిర్మాతలు రెడీగా ఉన్నారు. బన్నీ తదుపరి సినిమా గీతా ఆర్ట్స్‌లోనే. కాబట్టి... ఆ సినిమాకి ఎంత పారితోషికం అందుకున్నాడో ఆ వివరాలు బయటకు రావు. కాకపోతే.. కొత్తగా బన్నీతో సినిమా చేయాలంటే మాత్రం రూ.70 కోట్లు సమర్పిచుకోవాల్సిందే. ఈ 70 కోట్లు నిజమైతే.. ప్రభాస్ తరవాత తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్ బన్నీనే అవుతాడు.