తెలుగు సినిమాల సత్తా ఏమిటో కరణ్ జోహార్‌కి బాగా తెలుసు. మన బాహుబలిని హిందీలో ప్రమోట్ చేసింది ఆయనే. ఓ విధంగా బాలీవుడ్‌లో బాహుబలి సాధించిన ఘన విజయానికి ఆయన ప్రత్యక్ష సాక్షి.
ఆ తరవాత ప్రభాస్ తో ఓ సినిమా చేయాలని తెగ తహతహలాడిపోయాడు. కానీ కుదర్లేదు. ఆ వెంటనే విజయ్ దేవరకొండని లైన్‌లో పెడదామనుకున్నాడు అది కూడా వర్కవుట్ కాలేదు. అఖిల్‌తో ఓ సినిమా చేయాలని వుంది అని స్వయంగా నాగార్జునతోనే చెప్పాడు. కానీ నాగ్ కూడా అందుకు సముఖంగా లేకపోవడంతో... కరణ్ ప్లానింగులేమీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు కరణ్ జోహార్ చూపు అల్లు అర్జున్‌పై పడినట్టు తెలుస్తోంది.
ఇటీవల బన్నీని కరణ్ కలిశాడని, ఇద్దరి మధ్య సినిమాకి సంబంధించిన చర్చలు సాగాయని సమాచారం. తన మార్కెట్ మరింత విస్క్రృత పరచుకోవాలని బన్నీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇప్పటికే కేరళ తీరాన్ని తాకిన బన్నీ పవనాలు.. ప్రస్తుతం తమిళ చిత్రసీమపై దృష్టి పెట్టాయి. అక్కడ నేరుగా ఓ సినిమా చేశాక... అప్పుడు బాలీవుడ్ గురించి ఆలోచిస్తానని కరణ్‌కి మాటిచ్చాడట.
మొత్తానికి కరణ్ జోహార్ అన్వేషణ.. ప్రభాస్ నుంచి మొదలై... బన్నీ వరకూ సాగింది. కానీ ఏ ఒక్క హీరో కూడా కరణ్‌తో జట్టు కట్టడానికి ముందుకు రాలేదు. మరి బన్నీ మాటేమిటో...??