బాలీవుడ్ లో పుష్ప దుమ్ము దులుపుతోంది. సౌత్ లో డివైడ్ టాక్ వచ్చినా, నార్త్ లో వీర కుమ్ముడు కుమ్ముతోంది. దాదాపు రూ.100 కోట్ల మైలురాయికి దగ్గరలో ఉంది. బన్నీ సినిమా బాలీవుడ్ లో ఈ స్థాయిలో వసూళ్లు దక్కించుకోవడం ఇదే ప్రధమం. దీంతో త్వరలోనే బన్నీ ఓ బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడని, అందుకు సంబంధించిన ఎగ్రిమెంట్లు కూడా పూర్తయిపోయాయని ఇటీవల వార్తలొచ్చాయి. వీటిపై ఓ ఇంటర్వ్యూలో బన్నీ స్పందించాడు. తనకు బాలీవుడ్ లో నటించాలని ఉందని, అయితే ఇప్పటి వరకూ ప్రోపర్ గా ఆఫర్ ఏం రాలేదని, ఏ బాలీవుడ్ సినిమాపైనా సంతకం చేయలేదని క్లారిటీ ఇచ్చేశాడు.
‘‘ బాలీవుడ్‌లో చాలా మంచి దర్శకులున్నారు. మంచి స్క్రిఫ్ట్‌తో ఏ దర్శకుడు వచ్చినా తప్పకుండా నటిస్తాను. మంచి ప్రాజెక్టులో భాగం కావాలని నాకు ఉంది. ఇప్పటి వరకు ఒక్కరు కూడా నన్ను సంప్రదించలేదు. గతంలో కొన్ని పార్టీల్లో దర్శకులను కలిసిన మాట వాస్తవమే. ఏ ప్రాజెక్టులోనైనా భాగం అయితే తప్పకుండా ప్రకటిస్తాను. కానీ, ఇప్పటి వరకు ఏది కూడా ఫైనలైజ్ కాలేదు ’’ నాకు స్క్రిఫ్ట్ చాలా ముఖ్యం. స్క్రిఫ్ట్ డిమాండ్ మేరకు ఎవరయితే నటిస్తారో వారితో సినిమా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు వ్యక్తిగతంగా ఫలానా వాళ్లతోనే నటించాలని, ఫలానా వాళ్ల సినిమాల్లో చేయాలి అని ప్రత్యేకంగా ఏం లేదు. అది స్క్రిప్టుని బట్టి ఆధారపడి ఉంటుంద''న్నాడు బన్నీ. సో.. మంచి కథతో ఎవరొచ్చినా, అందులో నటించడానికి బన్నీ సిద్ధంగానే ఉన్నాడన్నమాట.