తన సినిమాపై నెగిటీవ్ గా ఎవరైనా ట్వీట్ చేస్తారా? డబ్బుల కోసమే ఈ సినిమాచేశారంటూ.. ఎవరైనా ఆరోపిస్తారా? రానా అదే చేశాడు. రానా కథానాయకుడిగా నటించిన `1945` ఈ శుక్రవారం విడుదలై.. డిజాస్టర్ టాక్‌ని మూటగట్టుకుంది. ఈసినిమాని ఎలాంటి పబ్లిసిటీ జరగలేదు. ఈ సినిమాని రానా ఎప్పుడో వదిలేశాడు. కనీసం డబ్బింగ్ కూడా చెప్పలేదు. దానికి తోడు... ఈ సినిమా క్లైమాక్స్ లేకుండానే విడుదలైంది. క్లైమాక్స్ షూట్ చేయకుండా ఓ సినిమాని ఇలా రిలీజ్ చేయడం చిత్రసీమలోనే ఇదే తొలిసారి కావొచ్చు. ఈ సినిమాపై ఇప్పుడు రానా ఓ ట్వీట్ చేసి మరింత షాక్ ఇచ్చాడు.
`‘సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు. క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ జరగలేదు. అలాగే నిర్మాత నుంచి నాకు రావాల్సిన రెమ్యునరేషన్ అందలేదు. డబ్బుల కోసమే పూర్తికాని సినిమాను విడుదల చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు’` అంటూ ట్వీట్ చేశాడు రానా. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. తనకు డబ్బులు ఎగ్గొట్టడమే కాకుండా, సినిమా పూర్తి కాకుండానే రిలీజ్ చేయడంపై రానా ఈ రకంగా ఫైర్ అయ్యాడు. దీనిపై లీగల్ గా కూడా రానా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే రానా ట్వీట్ పై నిర్మాతలు సైతం స్పందించారు. సినిమా క్లైమాక్స్ తో విడుదల చేయాలా, లేకుండా చేయాలా అనేది దర్శకుడి నిర్ణయానుసారం ఉంటుందని తేల్చి చెప్పారు. ఏదేమైనా క్లైమాక్స్ లేకుండానే ఓ సినిమా ఇలా విడుదల కావడం టాలీవుడ్ లో.. చర్చనీయాంశంగా మారింది.