స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిర్మాతగా మారుతున్నాడట. ఆల్రెడీ అల్లు అర్జున్ తాత, తండ్రులు నిర్మాణ రంగంలో దూకుడు ప్రదర్శించిన వారే. తాత అల్లు రామలింగయ్య నటుడిగా, నిర్మాతగా సుపరిచితుడే. ప్రముఖ నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. లేటెస్టుగా గీతా ఆర్ట్స్ 2 పేరిట చిన్న సినిమాలను నిర్మించడం కూడా పనిగా పెట్టుకున్నారు అల్లు అరవింద్.
ఇక అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్‌కీ నిర్మాణంతో సంబంధం ఉంది. హీరో కాకముందు నిర్మాణ రంగంలో పని చేసిన అనుభవం ఉంది అల్లు శిరీష్‌కి. తాజాగా అల్లు అర్జున్ కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ స్టైలే వేరు. తన సొంత బ్యానర్‌లో రూపొందించేది సినిమాలు కాదట. అసలు వెండితెరకు సంబంధించిన నిర్మాణ సంస్థ కానే కాదట. బన్నీ రూపొందిస్తున్న ప్రొడక్షన్ హౌస్ బుల్లితెరకు సంబంధించినదట.
బుల్లితెరపై అభిరుచి గల కొన్ని రియాల్టీ షోస్, స్పెషల్ ప్రోగ్రాంస్. ఇలా విభిన్నమైన కార్యక్రమాలను ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా పరిచయం చేయనున్నాడట అల్లు అర్జున్. ఈ నిర్మాణ సంస్థలో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి కూడా భాగస్వామ్యం కానుందట. ఇదిలా ఉంటే బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కోసం సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జనవరిలోనే ఏదో ఒక మంచి రోజు చూసి ఈ సినిమాని లాంఛ్ చేయనున్నారు. ఈ సినిమాని డివివి దానయ్య, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.