అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `పుష్ష`. రష్మిక కథానాయికగా నటిస్తోంది. అతి త్వరలో షూటింగ్ మొదలెట్టేయాలని సుకుమార్ భావిస్తున్నాడు. అందుకు తగిన ఏర్పాట్లూ జరిగిపోతున్నాయి. అయితే.. ఈ ప్రాజెక్టుకి ఓ సమస్య వెంటాడుతూ ఉంది. అదేంటంటే ఈ సినిమాలో ఇప్పటి వరకూ విలన్ ఎవరన్నది తేలలేదు. విజయ్‌సేతుపతి ని ముందు ఎంచుకున్నా, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆ తరవాత... మాధవన్ పేరు వినిపించింది. `సవ్యసాచి`లో మాధవన్ ప్రతినాయకుడిగా నటించాడు. కాబట్టి.. మాధవన్ ఈ సినిమా కూడా ఒప్పుకుని ఉంటాడనుకున్నారంతా.
అయితే `పుష్ష` విషయంలో మాధవన్ స్పందించాడు. పుష్ఫలో తాను నటించడం లేదని, ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. దాంతో.. ఈ సినిమాలో మాధవన్ లేడని స్పష్టం అయిపోయింది. మరి మాధవన్ కాకపోతే ఎవరు? అన్నదే ఇప్పుడు ప్రశ్న. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాలి. ఇప్పటికైతే విలన్ ఖాయం కాలేదు. సుకుమార్ ముందున్న ప్రత్యామ్నాయం.. బాబి సింహా. తనతో చిత్రబృందం సంప్రదింపులు జరుపుతోంది. కానీ... బాబి సింహా నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదు. మరి చివరికి ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.