ఒకప్పుడు సినిమా బడ్జెట్ వంద కోట్లంటే నోరు వెళ్లబెట్టేవారు. `వంద కోట్ల సినిమానా` అని ఆశ్చర్యపోయేవారు. ఆ తరవాత.. వంద కోట్లన్నది చాలా కామన్ అయిపోయింది. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమాలే రూ.500 కోట్ల బడ్జెట్లు దాటేశాయి. ఇప్పుడు బడా హీరోతో సినిమా అంటే మినిమం 200 కోట్లు లేకపోతే పని జరగడం లేదు. పారితోషికాలు కూడా అదే స్థాయిలో తీసుకుంటున్నారు. మహేష్, పవన్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు రూ.50 కోట్ల మార్క్ దాటేశారు. ప్రభాస్ అయితే వంద కోట్లు అందుకుంటున్నాడు. తెలుగులో వంద కోట్ల పారితోషికం అందుకుంటున్న హీరో ప్రభాసే. ఇప్పుడు ఆ జాబితాలో అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు.
పుష్ప తో అల్లు అర్జున్ రేంజ్ ఏమిటో అందరికీ తెలిసిపోయింది. కాస్త డివైడ్ టాక్ వచ్చినా.. వసూళ్లు ఎక్కడా ఆగలేదు. క్రమంగా హిట్.. సూపర్ హిట్.. సన్సేషనల్ హిట్... ఇలా దూసుకుపోయింది. పుష్ప 1కి బన్నీ అందుకున్న పారితోషికం రూ.50 కోట్లే. ఇప్పుడు పుష్ప 2కి వచ్చేసరికి రూ.100 కోట్లు ఇవ్వాల్సివచ్చింది. నార్త్ లో పెరిగిన మైలేజీ వల్లే.. మైత్రీ మూవీస్ బన్నీకి 100 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చారు. సుకుమార్ కూడా ఈ సినిమాకి రూ.50 కోట్ల పారితోషికం అందుకున్నట్టు టాక్. ఆ లెక్కన... రాజమౌళి తరవాత అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకుడిగా సుకుమార్ రికార్డ్ సృష్టించాడు.