కరోనా చిత్రసీమలో సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. సినిమాలు ఆగిపోయాయి. షూటింగులు లేకుండా పోయాయి. విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలీకుండా పోయింది. దాంతో వడ్డీలు కొండంత పెరిగిపోయాయి. ఈ వడ్డీల భారం ప్రతీ సినిమా మోసింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. అన్ని సినిమాలూ... విపరీతంగా నష్టపోయాయి. ఆచార్యపై వడ్డీల భారం దాదాపుగా రూ.50 కోట్లయ్యిందట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవినే వెల్లడించడం విశేషం.
దాదాపుగా రెండున్నరేళ్లు ఈ సినిమా చిత్రీకరణ దశలోనే ఉండిపోయింది. సినిమా ఎప్పుడో పూర్తయినా, విడుదల చేయడం సాధ్యం కాలేదు. సమీకరణాలు కుదరకపోవడం వల్ల.. సినిమా చేతిలో ఉన్నా, విడుదల చేయడం కుదర్లేదు. దాదాపు యేడాది పాటు ఈ సినిమాకి వడ్డీలు కడుతూనే ఉన్నారు. నెలకు దాదాపు రూ.3 కోట్ల వరకూ వడ్డీ కట్టారట. అంటే... సుమారుగా 40 కోట్లు వడ్డీల రూపంలో పోయాయి. అంటే.. చిరు చెప్పిన లెక్క దాదాపు కరెక్టే. ఆర్.ఆర్.ఆర్ సినిమాకీ ఇలానే... వడ్డీల మీద వడ్డీలు కట్టాల్సివచ్చింది. ఆ సినిమాకి దాదాపు రూ.100 కోట్ల వరకూ వడ్డీ అయ్యిందని తెలుస్తోంది.