తెలుగులో తొలి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ తో గుర్తింపు తెచ్చుకుంది ఆహా. అల్లు అరవింద్ లాంటి బుర్ర.. ఆహాకి తోడుగా ఉండడం, ఇంకొంతమంది పెద్ద తలకాయలు ఆహా వెనుక సపోర్ట్ గా నిలబడడంతో `ఆహా` సక్సెస్ అవుతుందని అంతా భావించారు. అయితే... మిగిలిన ఓ టీ టీ సంస్థలు ఇస్తున్న పోటీని ఆహా తట్టుకోలేకపోతోంది. పైగా.. ఆహాలో గొప్ప కంటెంట్ ఏమీ కనిపించడం లేదు. కోట్ల పెట్టుబడికి తగిన రాబడి రాకపోవడం, ఎన్ని వెబ్ సిరీస్‌లు పెట్టినా, వాటికి ఆదరణ లభించకపోవడంతో ఆహాని ట్రాక్ ఎలా ఎక్కించాలా? అని మధన పడుతున్నారు అల్లు అరవింద్. ఇప్పుడు ఆయనకు `ఆహా` అనేది వదిలించుకోలేని గుది బండగా మారింది. ఆహాని ట్రాక్ లో పెట్టడం తన ముందుకు లక్ష్యం. అందుకోసం మరిన్ని సీరియస్ ప్రయత్నాలు ప్రారంభించారు అల్లు అరవింద్.
టాలీవుడ్‌లోని కొంతమంది దర్శకుల్ని అల్లు అరవింద్ సంప్రదించారు. వాళ్లలో హరీష్‌శంకర్, క్రిష్, మారుతి, చంద్ర సిద్దార్థ్, నందినిరెడ్డి లాంటివాళ్లు ఉన్నారు. వీళ్ల పని.. మంచి కంటెంట్‌లను వెదికి పట్టడమే. తమ దగ్గరున్న కథలు గానీ, లేదంటే తమ శిష్యగణంలో ఉన్న యువ దర్శకులు చెప్పిన కథలు గానీ విని.. అవి వెబ్ సిరీస్‌లుగా పనికొస్తాయా? అనేది డిసైడ్ చేయడం. వీలుంటే.... తమే కథలు సిద్ధం చేసి, వాటిని యువ దర్శకులకు అప్పగించడం. విజయ్ దేవరకొండ లాంటి హీరోలూ ఆహాకి అండదండగా ఉన్నారు. వాళ్ల సహాయంతో కంటెంట్ మెరుగు పరచుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు అల్లు అరవింద్. మరి ఈ దర్శకుల రాకతో అయినా ఆహా... ఆహా అనిపించేలా మారుతుందేమో చూడాలి.