అల్లువారబ్బాయి శిరీష్ ఇటు తెలుగులోనూ, తమిళంలోనూ కూడా సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యనే తమిళంలో ఓ క్రేజీ ప్రాజెక్టును దక్కించుకున్న అల్లు శిరీష్, ఇంతలోనే ఆ ప్రాజెక్టును చేజార్చుకున్నాడు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, తమిళ స్టార్ హీరో సూర్యల మెగా మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో అల్లు శిరీష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుండి శిరీష్ తప్పుకున్నాడంటూ తాజాగా ప్రకటించాడు.
ఇలాంటివి చాలా అరుదైన అవకాశాలు. కానీ అంతకు ముందే తాను కమిట్ అయిన 'ఏబీసీడీ (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ)' సినిమాకి, ఈ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ కాని కారణంగానే ఈ సినిమా నుండి తాను తప్పుకోవాల్సి వస్తుందని శిరీష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ మెగా ఛాన్స్‌ని వదులుకోవడంలో శిరీష్ తొందరపడ్డాడా? అని అభిమానులు భావిస్తున్నారు.
ఈ సినిమాలో శిరీష్‌ది విలన్ పాత్రనీ, లేదు లేదు ఓ విభిన్నమైన పాత్రనీ గత కొంత కాలంగా వార్తలు వెలువడిన నేపథ్యంలో శిరీష్ పోషించబోయే ఆ పాత్రపై ఆశక్తి, అంచనాలు భారీగా పెరిగాయి. అయితే శిరీష్ తాజా ప్రకటనతో అభిమానులు డీలా పడ్డారు. మరోవైపు 'ఎబీసీడీ' సినిమా కూడా ఓ విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న సినిమా.
ఈ సినిమాలో 'కృష్ణార్జున యుద్ధం' ఫేం రుక్సార్ మీర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాల నటుడిగా పాపులర్ అయిన భరత్, ఈ సినిమాలో శిరీష్‌కి ఫ్రెండ్‌గా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు.