సంక్రాంతి అంటేనే అల్లుళ్ల పండగ. కొత్త అల్లుళ్లతో తెలుగిళ్లు కళకళలాడతాయి. ఈసారి థియేటర్‌కీ ఓ అల్లుడు వచ్చాడు. కానీ.. తనకే ఎలాంటి కళా లేదు. ఆ అల్లుడే `అల్లుడు అదుర్స్`. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సినిమా ఇది. జనవరి 14న విడుదలైంది. తొలి షోకే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. బెల్లంకొండ కెరీర్‌లోనే ఇది అతి పెద్ద ఫ్లాప్ అని... సినీ విశ్లేషకులు, ట్రేడ్ నిపుణులూ తేల్చేశారు. అదే రోజున.. `రెడ్` సినిమా రిలీజ్ అవ్వడం, `క్రాక్` సినిమా సూపర్ హిట్ టాక్ తో నడుస్తుండడంతో.. ఆ ప్రభావం సైతం `అల్లుడు అదుర్స్`పై పడింది. తొలి మూడు రోజుల వసూళ్లు.. ఓ మోస్తరుగా ఉన్నాయి. దాంతో ఈ సినిమాకి భారీ నష్టాలు తప్పవని టాక్.
ఈ సినిమాకి దాదాపు 30 కోట్లయ్యిందట. వసూళ్లు, శాటిలైట్ హక్కుల రూపంలో 20 కోట్ల వరకూ వచ్చాయి. అంటే.. దాదాపు 10 కోట్ల నష్టాలన్నమాట. ఈ సినిమాని నిర్మాతలు అన్ని ఏరియాల్లోనూ సొంతంగా విడుదల చేశారు. కాబట్టి.. ఆ నష్టం కూడా నిర్మాతలపై పడింది. బెల్లంకొండ కి హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో భారీ మొత్తం అందుతుంటుంది. అదే.. ఈసారీ తనని కాపాడింది.