ప్రతీ యేటా సంక్రాంతి సీజన్ తోనే తెలుగు సినిమా క్యాలెండర్ మొదలవుతుంది. ఈసారి కరోనా భయాల నేపథ్యంలో సంక్రాంతి సీజన్ సజావుగా సాగుతుందా, లేదా? కొత్తసినిమాలు వస్తాయా, రావా? అన్న అనుమానాలు భయాలు నెలకొన్నాయి. అయినా సరే.. నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. క్రాక్, మాస్టర్, రెడ్, అల్లుడు శీను సినిమాలు బరిలో నిలిచాయి. స్టార్ హీరో సినిమా ఏదీ లేకపోయినా.. సీజన్ లో నాలుగు సినిమాలు విడుదల కావడం - బాక్సాఫీసుకి కొత్త కళ తీసుకొచ్చింది.
9న క్రాక్ వచ్చింది. విడుదల ఆలస్యం అయినా సరే... క్రాక్ కి హిట్ టాక్ రావడంతో నిర్మాతలతో పాటు చిత్రసీమ ఊపిరి తీసుకుంది. రవితేజ వరుస ఫ్లాపులకు ఈ సినిమా బ్రేక్ వేసినట్టైంది. 50 శాతం ఆక్యుపెన్సీలో సైతం.. మంచి వసూళ్లు రాబట్టుకుంది. 13న `మాస్టర్` వచ్చింది. విజయ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. సినిమాలో మాస్ అంశాలు ఉండడం ప్లస్ అయ్యింది. హీరోయిజం ఎలివేట్ అయ్యింది. విజయ్ సేతుపతి లాంటి విలన్ ఉండడం మరో ప్లస్ పాయింట్. యావరేజ్‌కి అటూ ఇటూ ఆగిపోయిన ఈ సినిమా తెలుగులో ఓ మోస్తరు వసూళ్లని దక్కించుకుంది.14న రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండూ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. రామ్... రెడ్ అంతగా ఆకట్టుకోలేదు. తమిళ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా.. అటు క్లాస్ నీ ఇటు మాస్ నీ మెప్పించలేకపోయింది. అల్లుడు అదుర్స్ అయితే మరీ తీసినట్టు. ఫక్తు రొటీన్ సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా అల్లుడు నిలిచిపోయింది. ఈ సినిమాకి దారుణమైన రేటింగులు వచ్చాయి. రెడ్, అల్లుడు అదుర్స్ ఈ రెండు సినిమాలతోనూ నిర్మాతలకు నష్టాలు తప్పవని తేలిపోయింది.
సంక్రాంతి సీజన్ తరవాత కూడా క్రాక్ తన హవా చూపించే అవకాశం వుంది. కాస్తో కూస్తో... మాస్టర్ వసూళ్లు ఫర్వాలేదనిపిస్తున్నాయి. మొత్తానికి ఎలా చూసినా ఈ సంక్రాంతి విజేత.. రవితేజనే! ప్రతీ సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చినా ఒకటోరెండో హిట్ అవుతుంటాయి. ఈసారి ఆ ఛాన్స్ క్రాక్ దక్కించుకుంది.