చిరంజీవి - రాజకీయాలు అన్నది ఇప్పటి మాట కాదు. చిరు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని చెప్పినప్పటి నుంచీ తన కథల్లో పొలిటికల్ సెటైర్లు వినిపించడం మొదలెట్టారు. ఓరకంగా ముఠామేస్త్రి నుంచీ ఈ పంథా మొదలైంది. ఆయన రాజకీయాల్లోకి రావడం, వెళ్లిపోవడం అయిపోయినా - రాజకీయ కోణాన్ని సృశించడం తగ్గలేదు. ఖైదీ నెం 150లో కూడా కొన్ని పొలిటికల్ డైలాగులు పేలాయి. ఇప్పుడు ఆచార్యలోనూ అలాంటి సంభాషణలు వినిపిస్తాయని, సన్నివేశాలు కనిపిస్తాయని సమాచారం.
చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `ఆచార్య`. రామ్ చరణ్ కీలక పాత్రధారి. నక్సల్ నేపథ్యంలో సాగే కథ ఇదని, దేవాలయాల నేపథ్యం కూడా కనిపిస్తుందని ముందు నుంచీ టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో కొన్ని పొలిటికల్ సెటైర్లూ పేలబోతున్నాయట. అవన్నీ ఆచార్యకే హైలెట్ అవుతాయని సమాచారం. రాజకీయ నాయకులు వాగ్దానాలు, ఎజెండాల పేరుతో సమాజాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తున్నారో ఆయా డైలాగుల్లో చెప్పబోతున్నార్ట చిరు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినవి? థియేటర్లో పేలే ఈ డైలాగ్స్ పొలిటికల్ గ్రౌండ్ లో ఎంత కలకలం సృష్టించనున్నాయి? అనే విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.