'మహానటి' చిత్రంతో కీర్తి సురేష్ పాపులారిటీ భారీగా పెరిగింది. దానికితోడు 'మహానటి' తర్వాత కథా ప్రాధాన్యమున్న సినిమాలలో నటిస్తూ కీర్తి కూడా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈమధ్య క్రైమ్ థ్రిల్లర్ 'పెంగ్విన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.
అమెజాన్ ప్రైమ్ వారు ఆ సినిమా కోసం భారీ మొత్తం చెల్లించారని, అయితే మిశ్రమ స్పందన రావడంతో కీర్తి నటిస్తున్న కొత్త సినిమాల మార్కెట్ పై ప్రభావం పడుతుందని భావించారు. అయితే అలా ఏమీ జరగలేదట. కీర్తి నటిస్తున్న మరో సినిమా 'గుడ్ లక్ సఖి' సినిమాకు ఓటీటీల నుండి మంచి ఆఫర్లు వస్తున్నాయట. ఈమధ్య విడుదలైన 'గుడ్ లక్ సఖి' టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కడంతో సినిమాకు మంచి రేటు ఇచ్చేందుకు అమెజాన్ ప్రైమ్ వారు ముందుకు వచ్చాడట. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేసేందుకు 13 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని, డీల్ దాదాపుగా ఫైనలైజ్ అయిందని సమాచారం.
ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ, రమాప్రభ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు నగేష్ కుకునూర్. వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.