భారతదేశ వెండితెర పైకి రానున్న ఘనమైన సినిమా 'సైరా నరసింహారెడ్డి'. ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం. చిరంజీవిగారి పెద్దమాయి సుస్మిత ఈ సినిమాకి కాస్ట్యూం డిజైనర్. అలాగని ఆమె అందరికీ డిజైనర్ కాదు..కేవలం చిరంజీవి, అమితాబ్, నయనతార, తమన్నాలకు మాత్రమే ఆమె పనిచేసారు. ఇంతకీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి గురువైన గోసాయి వెంకన్న పాత్రలో కనిపిస్తున్న అమితాబ్ బచ్చన్ కోసం చేసిన కాస్ట్యూం డిజైన్ ఐడియా ఎక్కడినుంచి వచ్చిందో తెలుసా?
సుప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ నుంచి. నిజానికి గోసాయి వెంకన్న ఎలా ఉంటాడో, ఏ దుస్తులు ధరించేవాడో చారిత్రక ఆధారాలు లేవు. కనుక కల్పించుకుని దుస్తులు డిజైన్ చెయ్యాలి. ఆ పాత్ర పోషిస్తున్నది ఆరున్నర అడుగుల అమితాబ్. పోషిస్తున్న పాత్ర హీరోకి గురువు. గురువు అనగానే సుస్మితకి జగ్గి వాసుదేవ్ గుర్తొచ్చారట. ఆ మధ్య ఆయన చిరంజీవి కుటుంబ సభ్యులతో చాలా సమయం గడిపారు.
చిరంజీవి ఇంట్లో నిర్వహించిన ఒక ప్రైవేట్ సత్సంగ ప్రసంగానికి కూడా ఆయన వచ్చి వెళ్లారు. కనుక ఆయన సుస్మిత మనసులో మెదిలారు. అంతే, జగ్గి వాసుదేవ్ వేషధారణని ఆమె అమితాబ్ కి వేసేసారు. ఒక్కటే తేడా ఏమిటంటే తలపాగా లేకపోవడం. అదొక్కటి కూడా పెట్టేసుంటే జగ్గి వసుదేవ్ లాగానే కనిపించేవారు అమితాబ్. అందుకే అది పెట్టలేదు. అదన్నమాట..అమితాబ్ దుస్తుల వెనుక ఉన్న జగ్గి వాసుదేవ రహస్యం.