'గోసాయి వెంకన్న'గా 'సైరా నరసింహారెడ్డి'లో కీలక పాత్ర పోషించిన బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అనారోగ్యం కారణంగా మంగళవారం ఆసుపత్రిలో చేరారు. ముంబై నానాపతి ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్‌ని పరామర్శించేందుకు ఆయన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి వెళుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందనీ, రెగ్యులర్ చెకప్ కోసమే అమితాబ్ ఆసుపత్రికి వచ్చారనీ, ఆయనకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమనీ వైద్యులు తెలిపారు.
అమితాబ్ గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'నా కాలేయం 75 శాతం పాడైపోయింది..' అంటూ అమితాబ్ స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. టీబీ, హెపటైటిస్ బీ తదితర వ్యాధుల నుండి ఇటీవలే ఆయన ఉపశమనం పొందారు. ఇక కాలేయం సంబంధిత వ్యాధికి సంబంధించి రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది.
ఆ క్రమంలోనే ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారనీ అమితాబ్ కుటుంబ సభ్యుల ద్వారా అందుతోన్న సమాచారం. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా, ఆయన ఎప్పుడూ నటనతో బిజీగా ఉంటారు. ఆయన చేతిలో ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టుల వరకూ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఆయన నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.