స్పెషల్‌ షార్ట్‌ ఫిలిం: కరోనా వేళ ఒక్కటైన భారతీయ సినీ జనం

మరిన్ని వార్తలు

కరోనా కలిపింది అందరినీ. ఎవరినంటారా.? టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌ అనే తేడా తారతమ్యాలు లేకుండా అన్ని భాషల్లో నుండి స్టార్‌ దిగ్గజాలు కలిసి ఓ షార్ట్‌ ఫిలింలో నటించారు. టాలీవుడ్‌ నుండి మెగాస్టార్‌ చిరంజీవి, బాలీవుడ్‌ నుండి బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, మలయాళ సూపర్‌ స్టార్స్‌ మమ్ముట్టి, మోహన్‌లాల్‌, కన్నడ సూపర్‌ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌, తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో పాటు, బాలీవుడ్‌ తారలు అలియా భట్‌, ప్రియాంకా చోప్రా, రణ్‌వీర్‌ తదితరులు నటించిన ఈ షార్ట్‌ ఫిలింకి ప్రసూన్‌ పాండే దర్శకత్వం వహించారు. లేటెస్ట్‌గా రిలీజ్‌ చేసిన ఈ షార్ట్‌ ఫిలిం, నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. అంతా బాగానే ఉంది కానీ, అన్ని భాషల్లోని స్టార్‌ దిగ్గజాలను ఒక్క చోట చేర్చి ఈ షార్ట్‌ ఫిలింని ఎలా రూపొందించారనే కదా.. మీ అనుమానం. అయితే మీకు అసలు విషయం తెలియాల్సిందే. పైన చెప్పుకున్న స్టార్స్‌ ఎవ్వరూ ఇంటి నుండి బయటికి రాలేదు. అంతా ఎవరి ఇంట్లో వారే, ఎవరి పనుల్లో వారే ఉన్నారు.

 

కానీ, ఒకే షార్ట్‌ ఫిలింలో యాక్ట్‌ చేశారు. భలే గొప్ప విషయం కదా. ఇంతకీ ఈ షార్ట్‌ ఫిలిం కాన్సెప్ట్‌ ఏంటో తెలుసా.? బిగ్‌బీ అమితాబ్‌ తన నల్ల కళ్లజోడును ఎక్కడో పెట్టి మర్చిపోతారు. వాటిని వెతికే పనిని రణ్‌వీర్‌, దిల్జీత్‌ దోసంజ్‌కి అప్పగిస్తారు. ఆ క్రమంలో వీరిద్దరూ ఇళ్లంతా కలియదిరుగుతూ, ఇంట్లో వేర్వేరు పనుల్లో బిజీగా ఉన్న మన స్టార్స్‌ అందర్నీ ఒక్కొక్కరుగా అడుగుతుంటారు. తమకు తోచిన సమాధానం వారు చెబుతుంటారు. చివరికి ప్రియాంకా చోప్రా ఆ కళ్లజోడును తెచ్చి బిగ్‌బీకి ఇవ్వడంతో, కథ ముగుస్తుంది. వీడియో చివర్లో కరోనాని కట్టడి చేయడంలో తమలాగే అంతా ఇంట్లోనే ఉండాలని అమితాబ్‌ సందేశమిచ్చారు. భారతీయ చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటే అని చాటి చెప్పేందుకే ఈ ప్రయోగం చేశామనీ, లాక్‌డౌన్‌ కారణంగా కార్మికులూ, దినసరి కూలీలకు తోడ్పాడునివ్వడానికి నిధులు సమకూర్చడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమనీ, స్టే హోమ్‌ స్టే సేఫ్‌ అని అమితాబ్‌ ఈ వీడియోలో పేర్కొన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS