అమితాబ్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితి గురించి సినీ లోకం ఆందోళన చెందుతోంది. ఆదివారం ఉదయం.. బిగ్ బికి ఓ సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని... అమితాబ్ బచ్చన్ తన బ్లాకులో సూచన ప్రాయంగా తెలిపారు కూడా. తనకో సర్జరీ ఉందని, అంతకంటే ఏమీ చెప్పలేనని... రాసుకొచ్చారు. అసలు సర్జరీ వివరాలేం చెప్పకుండా.. ఆయన నర్మగర్భంగా మాట్లాడడం అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది.
అసలు అమితాబ్ కి ఏమైంది? ఆ సర్జరీ ఎందుకోసం..? అనే విషయాల్ని అమితాబ్ కుటుంబ సభ్యులు ఇప్పటి వరకూ తెలియజేయలేదు. ఆపరేషన్ జరిగి 24 గంటలు కావొస్తోంది. అయినా సరే.. ఎలాంటి అప్ డేటూ లేదు. నిజానికి అమితాబ్ పీఆర్ టీమ్ చాలా అప్రమత్తంగాఉంటుంది. బిగ్ బీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటారు. తన విషయంపై ఎలాంటి అపోహలకు, అనుమానాలకూ తావివ్వరు. అయితే ఈసారి.. మాత్రం అమితాబ్ ఆరోగ్య విషయం గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.