నటుడిగా, రచయితగా తనికెళ్ల భరణి సుపరిచితులే. ఆమధ్య దర్శకుడిగానూ మారారు. `మిథునం`తో పలు అవార్డులు దక్కాయి. రివార్డులూ అందుకున్నారు. ఇప్పుడు కె.రాఘవేంద్రరావు హీరోగా... భరణి దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో నలుగురు కథానాయికలుంటారని వినికిడి. ఈలోగా.. భరణికి బాలీవుడ్ ఛాన్సొచ్చింది. అందులోనూ... అమితాబ్ బచ్చన్ సినిమా.
భరణి తెలుగులో తీసిన `మిథునం`ని బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి ఓ నిర్మాత ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో అమితాబ్, రేఖ జంటగా నటిస్తారు. ఈ విషయాన్ని భరణి సైతం ధృవీకరించారు కూడా. ``ఆరేళ్ల క్రితమే ఈ ప్రయత్నం ప్రారంభమైంది. కానీ మధ్యలో ముందుకు కదల్లేదు. ఈమధ్య బాలు గారు చనిపోయాక.. ఈ సినిమాని కన్నడలో డబ్ చేయడానికి ఓ నిర్మాత ముందుకొచ్చారు.ఆ సమయంలోనే... బిగ్ బీ... ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది. నిజంగా ఈ ప్రాజెక్టు వర్కవుట్ అయితే.. అదృష్టమే`` అన్నారు భరణి.