కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సినిమా రిలీజ్‌లు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఓ తెలుగు సినిమా సాహసించింది.. ఓటీటీలో విడుదలయ్యింది. అదే ‘అమృతరామమ్’ సినిమాకి నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. సరే, సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే, ఇది ఓ ప్రయోగాత్మక అంశం. ఓటీటీ తప్ప వేరే మార్గం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో.. అనే చర్చ జరుగుతున్న వేళ, ‘అమృతరామమ్’ పెద్ద సాహసమే చేసింది. సినిమాకి పబ్లిసిటీ చేసుకోవడానికి అవకాశం లేదు. దాంతో, ఓటీటీలో సినిమా రిలీజ్ అయ్యిందన్న సంగతే చాలామందికి తెలియదు.
చిన్న సినిమా పరిస్థితి ఇలా వుంటే, ఓ మోస్తరు సినిమాల మాటేమిటి.? బడా సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సి వస్తే.? ఇలా చాలా ప్రశ్నలు ఇప్పుడు సినీ పెద్దల మెదళ్ళను తొలిచేస్తున్నాయి. ‘డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ అస్సలేమాత్రం క్షేమం కాదు’ అని సినీ పెద్దలు తేల్చేస్తున్నారు. అదే నిజం. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాంటిదో, ఆడియో ఫంక్షన్ లాంటిదో లేకుండా సినిమాపై హైప్ ఎలా వస్తుంది.? సో, ఓటీటీ అనేది డైరెక్ట్ రిలీజ్‌లకు అస్సలేమాత్రం మంచిది కాదు. ‘అమృతరామవ్‌ు’ ఇచ్చిన షాక్‌తో అలాంటి ఆలోచనలు వున్న సినిమాలు వెనక్కి తగ్గాల్సిందే.. లాక్‌డౌన్ ఎత్తేసేవరకూ వేచి చూడాల్సిందే.