థియేటర్లు మూతబడడంతో అందరి దృష్టీ ఓటీటీ వేదికలపై పడింది. థియేటర్ల కోసం ఎదురుచూడకుండా, నేరుగా ఓటీటీలో విడుదల చేసుకోవడం ఓ ఉత్తమమైన మార్గం గా కనిపించింది. ఓటీటీ సంస్థలు కూడా ఫ్యాన్సీ రేట్లతో.. కొత్త సినిమాల్ని ఆకర్షించడానికి ప్రయత్నించాయి. కొన్ని సినిమాలు ఓటీటీ రేట్లకు తల వంచితే, ఇంకొన్ని బెట్టు చేశాయి. థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలైన తెలుగు సినిమాగా `అమృతారామమ్` ప్రత్యేకతని సాధించుకుంది. ఓటీటీలో కొత్త సినిమా రావడంతో జీ 5 ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపించారు. బుధవారం ఓటీటీలో ఈ సినిమా ప్రదర్శితమైంది.
అయితే.. ఈ చిత్రానికి ఏమాత్రం గొప్ప స్పందన రాలేదు. నెగిటీవ్ రివ్యూలొచ్చాయి. సోషల్ మీడియాలోనూ ఈసినిమాని ఏకి పారేస్తున్నారు. ఇలాంటి రివ్యూలు వచ్చాక కూడా ఓటీటీలోకి వెళ్లి, ఈసినిమా చూసేంత ధైర్యం సగటు ప్రేక్షకుడు చేయలేడు. పైగా ఈ సినిమాలో అంతా కొత్తవారే. తెలిసిన కాస్టింగ్ ఒక్కరూ లేరు. రాబోయే రోజుల్లో ఈ సినిమాని ఎవరూ పట్టించుకోకపోవొచ్చు. సో... ఓటీటీ బోణీ ఏమాత్రం బాగోలేనట్టే లెక్క. ఇలా వరుసగా రెండు మూడు ఫ్లాప్ సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షం అయితే.. జనాలకు వాటిపై కూడా ఆసక్తి తగ్గిపోవడం ఖాయం. ఓటీటీ సంస్థలు కూడా సినిమాని స్ట్రీమింగ్ చేసే విషయంలో చాలా ఆలోచించాల్సివుంటుంది.