సుకుమార్ ది ప్రత్యేకమైన శైలి. ఆయన కథలు, వాటిని తెరపై ఆవిష్కరించే పద్ధతి, హీరోల్ని చూపించే తీరు అన్నింట్లోనూ ప్రత్యేక ముద్ర కనిపిస్తుంది. ప్రస్తుతం `పుష్ష`తో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రమిది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ తరవాత సుకుమార్ చేయబోయే ప్రాజెక్టు గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. సుకుమార్ తదుపరి సినిమా తెలంగాణ సాయుధ పోరాటంపై సాగబోతోందట.
ఈ మధ్య సుకుమార్ తెలంగాణ పోరాటానికి సంబంధించిన పలు పుస్తకాలు చదివార్ట. అవి తనకు చాలా స్ఫూర్తినిచ్చాయని, అందుకే ఆ నేపథ్యంలో ఓ సినిమా తీయాలని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు సుకుమార్. తెలంగాణ పోరాటం అనేది చాలా సీరియస్ సబ్జెక్ట్. సుకుమార్ ఈ తరహా కథని ఎప్పుడూ డీల్ చేయలేదు. పైగా తను ఆంధ్రా దర్శకుడు. గోదావరి జిల్లాల నుంచి వచ్చినవాడు. తెలంగాణ పోరాటాల గురించి ఇక్కడి దర్శకులే ఎక్కువగా డిస్కర్స్ చేశారు. ఓ ఆంధ్రా దర్శకుడు తెలంగాణపై ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందో మరి.