అందాల భామ అమీ జాక్సన్ అంటే ప్రముఖ దర్శకుడు శంకర్‌కి అదో ఇది. ఆమెతో 'ఐ' సినిమాలో నటింపజేశాడు. '2.0' సినిమాలోనూ ఆమెకు ఛాన్సిచ్చాడు. తాజాగా మరో సినిమా కోసం శంకర్, అమీ జాక్సన్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా రూపొందుతోన్న 'భారతీయుడు-2' సినిమా కోసం ఇప్పటికే హీరోయిన్గా కాజల్ అగర్వాల్ పేరు ఖరారయ్యింది. తాజాగా విన్పిస్తోన్న గాసిప్స్ ఏంటంటే, శంకర్ ఈ సినిమా కోసం అమీ జాక్సన్‌ని కూడా ఎంపిక చేశాడట.
అయితే, అమీ జాక్సన్ ఓ స్పెషల్ సాంగ్‌లో కన్పించబోతోందనీ, దాంతోపాటుగా ఆమెకు సినిమాలో ఓ అతిథి పాత్ర కూడా ఇచ్చాడనీ సమాచారమ్. చాలాకాలం క్రితం వచ్చిన 'భారతీయుడు' సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. స్వాతంత్య్ర పోరాటం, దేశంలో పెరిగిపోయిన అవినీతి.. వంటి అంశాలపై ఆ సినిమా రూపొందింది. ఆ సినిమాని సాంకేతికంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన శంకర్, ఇప్పుడు మళ్ళీ ఆ సినిమాకి సీక్వెల్‌ని రూపొందించే క్రమంలోనూ గ్రాఫిక్స్ వైపు మొగ్గు చూపుతున్నాడు.
'2.0' సినిమా కోసం 600 కోట్లు ఖర్చు చేసిన శంకర్, 'భారతీయుడు' సినిమా కోసం మాత్రం, ఆ స్థాయిలో ఖర్చు చేయడానికి సుముఖత వ్యక్తం చేయడంలేదట. భారీ సినిమానే అయినా, ఖర్చు విషయంలో కంప్లీట్ 'కంట్రోల్'తో 'భారతీయుడు-2' తెరకెక్కించాలనుకుంటున్నాడట శంకర్. నిజమేనా? శంకర్ విషయంలో కంట్రోల్డ్ బడ్జెట్‌ని ఆశించగలమా? వేచి చూడాల్సిందే.