అటు బుల్లి తెర, ఇటు వెండి తెర.. అంటూ రెండు చేతులా సంపాదిస్తోంది అనసూయ. బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తార.. తనే. సినిమాల్లో అదే స్థాయిలో హవా చూపిస్తోంది. `చావు కబురు చల్లగా`లో అనసూయ ఓ ఐటెమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. 4 నిమిషాల పాట కోసం ఏకంగా 20 లక్షలు అందుకుందని ప్రచారం జరుగుతోంది. అంటే.. నిమిషానికి 5 లక్షలన్నమాట. ఆ లెక్కన చూస్తే... అనసూయ టాలీవుడ్ లో ఖరీదైన ఐటెమ్ గాళ్ కిందే లెక్క.
ఈ విషయాన్ని అడిగితే సీరియస్ అవుతోంది అనసూయ. ''నా పారితోషికం గురించి బయట జనాలకు అనవసరం. అది నిర్మాతకూ, నాకూ మధ్యలో సాగే వ్యవహారం. అనసూయ ఈ పాటకు న్యాయం చేసిందా, లేదా? అనేదే జనాలకు అవసరం. కొంతమంది నా పారితోషికం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ల జేబులోంచి డబ్బులు తీసి నాకు ఇవ్వడం లేదు కదా? ఇక 20 లక్షలు పారితోషికం అంటున్నారు. అదే నిజం... అదే అబద్ధం కూడా'' అని నర్మగర్భంగా సమాధానం ఇచ్చింది ఈ రంగమ్మత్త.