బిగ్ బాస్ హౌస్‌లో ఈసారి ఊహించని ట్విస్టు. టైటిల్‌కి గట్టి పోటీదారుడు అనిపించుకుంటున్న యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు. నిజంగా రవి ఎలిమినేట్ అవుతాడని ఎవ్వరూ అనుకోలేదు. చివరికి రవి కూడా ఊహించలేదు. ఈవారం ఎలిమినేట్ అయ్యేది నువ్వే అని నాగార్జున చెప్పేసరికి.. రవితో పాటు బిగ్ బాస్ హౌస్మేట్స్ కూడా నమ్మలేకపోయారు. రవి ఎలిమినేషన్ గురించి తెలుసుకున్న కొంతమంది అభిమానులు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ ని చుట్టుముట్టారు. రవికి అన్యాయం జరిగిందని, బిగ్ బాస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గోల గోల చేశారు.
బయటకు వచ్చిన రవి కూడా... తనకు అన్యాయం జరిగిందనే అంటున్నాడు. టాస్క్‌లు బాగా ఆడానని, నిజాయతీగా వ్యవహరించానని, కానీ.. చివరికి ఎలిమినేట్ అయ్యానని, తప్పు ఎక్కడ జరిగిందో తెలీదని వాపోతున్నాడు. బిగ్ బాస్ లో ఏం జరిగిందో తనకు తెలుసని, కానీ బయట ఎలాంటి ఫుటేజీ వచ్చిందో, ఎంత వరకూ చూపించారో ఇంకా తెలీదని, అది చూస్తే గానీ ఓ నిర్ణయానికి రాలేనని అంటున్నాడు రవి. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా తమని తప్పుడు నిర్ణయమని బాధ పడతారని, ఇప్పటికీ తానే బిగ్ బాస్ విన్నర్ అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.