ఈటీవీలోని `పటాస్` లాంటి వినోదాత్మక కార్యక్రమాల ద్వారా యాంకర్ రవి ప్రేక్షకులకు సుపరిచితమే. హీరోగానూ ఓ సినిమా చేశాడు. కానీ అది ఫ్లాప్ అయ్యిందనుకోండి. అది వేరే విషయం. ఎప్పుడూ నవ్వించాలని తాపత్రయపడే రవి.. ఈసారి సీరియస్ అయ్యాడు.
దానికీ కారణం ఉంది. యాంకర్ రవి అరెస్ట్ అయ్యాడంటూ ఆదివారం గాసిప్పులు షికారు చేశాయి. రవి ఓ వ్యక్తిపై దాడికి ప్రయత్నించాడని, అతని ఫిర్యాదు మేరకు ఎస్.ఆర్.నగర్ పోలీసులు రవిని అరెస్ట్ చేశారన్నది వార్తల సారాంశం.
అయితే తాను అరెస్ట్ కాలేదని, తాను ఎవ్వరిపై దాడి చేయలేదని, ఎవరూ తనపై దాడికి ప్రయత్నించలేదని, తాను క్షేమంగా ఉన్నానని ఫేస్ బుక్ ద్వారా వీడియో సందేశం అందించాడు రవి. తనపై ఇలాంటి రూమర్లు ప్రచారం చేసిన వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు.
నిజానికి ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్‌లో యాంకర్ రవిపై ఓ ఫిర్యాదు అందింది. సందీప్ అనే పంపిణీదారుడు `నాకు అప్పు ఇచ్చి, వడ్డీల కోసం వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఎస్.ఆర్ నగర్ పోలీసులు రవిని పిలిచి విచారణ చేశారు. చివరకు పోలీస్ స్టేషన్ బయటే సందీప్‌కీ - రవికీ రాజీ కుదరడంతో ఈ ఫిర్యాదుని ఉపసంహరించుకున్నారు.
దానికి రవి అరెస్ట్ అయ్యాంటూ ప్రచారం జరిగింది. అదీ.. అసలు కథ.