ఎఫ్ 2కి సీక్వెల్‌గా ఎఫ్ 3 రూపొందుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వేళ... సొంత ఊరులో కూర్చుని ఈ సినిమాకి సంబంధించిన కథ పూర్తి చేసేశాడు అనిల్ రావిపూడి. అంతేకాదు.. ఈ సినిమాపై ఉన్న కన్‌ఫ్యూజన్లను కూడా దించేశాడు. ఎఫ్ 3లో ముగ్గురు హీరోలుంటారని నిన్నా మొన్నటి మాట. అయితే ఈ సినిమాలో హీరోలు ఇద్దరే అని తేలిపోయింది. ఈ విషయంలో అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమాలో ఇద్దరే హీరోలుంటారని, ప్రస్తుతానికైతే ఇది ఇద్దరి హీరోల కథేనని, చివర్లో ఎవరైనా యాడ్ అయితే చెప్పలేననన్నాడు. పైగా ఎఫ్ 2లో నటించిన వాళ్లే ఇందులోనూ కనిపిస్తారని, కాకపోతే ఈ సినిమా కథ పెళ్లి చుట్టూ తిరగడదని, మరో గమ్మత్తైన పాయింటు దొరికిందని క్లూ ఇచ్చాడు అనిల్ రావిపూడి.
''నా సినిమాలకు సంబంధించిన స్క్రిప్టు పనులు విశాఖపట్నంలోనే చేస్తుంటా. ఎఫ్ 3 పనుల్నీ విశాఖలోనే మొదలెట్టా. అయితే ఇక్కడ కరోనా ప్రభావం ఎక్కువ అవ్వడంతో మా సొంత ఊరైన ప్రకాశం జిల్లా, చిలుకూరివారి పాలెం వచ్చేశా. ఎఫ్ 3 స్క్రిప్టు ఇక్కడే పూర్తి చేశా'' అన్నారు అనిల్ రావిపూడి. మహేష్‌తో అనిల్ రావిపూడి మరో సినిమా చేస్తాడన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందిస్తూ ''మహేష్ తో ఎప్పుడు సినిమా చేయడానికైనా రెడీనే. ఆ అవకాశం కోసం మళ్లీ మళ్లీ ఎదురు చూస్తుంటాను'' అని మహేష్ పై తన ప్రేమని వెలిబుచ్చాడు.