యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయాల్సి వుంది. కొన్ని కారణాలతో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. అప్పుడు బాలకృష్ణ కోసం తయారు చేసుకున్న స్క్రిప్ట్‌లో చిన్న చిన్న మార్పులు చేసి, దాన్నే ఇప్పుడు మహేష్‌బాబు హీరోగా 'సరిలేరు నీకెవ్వరూ' టైటిల్‌తో రూపొందించబోతున్నాంటూ అనిల్ రావిపూడిపై ఓ 'బిగ్' రూమర్ మొదలైంది. ఈ సినిమాలో మహేష్‌బాబు మిలిటరీ అధికారిగా కన్పించనున్న సంగతి తెల్సిందే. మహేష్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మండన్న హీరోయిన్గా నటించనుంది.
అయితే, మహేష్‌కి అనిల్ చెప్పిన కథ ఒకప్పుడు బాలయ్యకు చెప్పిందేనన్న ప్రచారాన్ని చిత్ర యూనిట్ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అప్పట్లో బాలయ్యతో అనిల్ సినిమా చేద్దామనుకున్న మాట వాస్తవమేననీ, అయితే ఆ కథకీ, ఇప్పుడు మహేష్‌తో తీయబోయే సినిమా కథకీ అస్సలేమాత్రం సంబంధం లేదనీ, ఇది మహేష్ కోసమే అనిల్ రూపొందించుకున్న కథ అనీ తెలుస్తోంది. సుకుమార్‌ని కాదని అనిల్ స్క్రిప్ట్‌కి మహేష్ ఓటు వేయడం వెనుక పెద్ద కథే నడిచింది.
ఓ పాయింట్‌ని మహేష్ స్వయంగా అనిల్‌కి చెప్పి, దాన్ని డెవలప్ చేయమన్నాడనీ, మహేష్ ఆలోచనలకు తగ్గట్టు అనిల్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశాడనీ సమాచారమ్. అయితే 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాపై వస్తున్న రూమర్స్‌కి చెక్ పెట్టాల్సింది దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రమే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే అనిల్, జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తాడా? వేచి చూడాలి.