ప్రస్తుతం టెక్నాలజీ మాయలో పడి, కుర్రకారు ఎలా ప్రవర్తిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అమ్మాయిల పరువు బజారున పడుతోంది. తద్వారా ఎలాంటి పరిణామాల్ని అమ్మాయిలు ఎదుర్కోవల్సి వస్తుందో ప్రతీరోజూ వార్తల్లో వింటూనే ఉన్నాం. సరిగ్గా ఇదే పాయింట్‌ని తీసుకుని తమిళ దర్శకుడు రామ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించాడు. అదే 'తారామణి'. అంజలి (అ), ఆండ్రియా (ఆ) ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.
ఎప్పుడో రిలీజ్ కావల్సిన ఈ సినిమాకి ప్రమోషన్స్ బాగానే చేశారు. కానీ, కొన్ని టెక్నికల్ రీజన్స్ కారణంగా విడుదల ఆలస్యమైంది. ఎట్టకేలకు విడుదకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. సెప్టెంబర్ 6న 'తారామణి' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని టెక్నాలజీ మాయాజాలాన్ని చూపించిన తీరుకు సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్‌హాసన్ కూడా ఇంప్రెస్ అయ్యారు. తమ వంతు సపోర్ట్ ఇచ్చారు ఈ సినిమాకి. ప్రచార చిత్రాలను వారి చేతుల మీదనే విడుదల చేశారు. ఇక సినిమా విషయానికి వస్తే, ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రస్తుతం అమ్మాయిలు ఎదుర్కొంటున్న టెక్నాలజీ సమస్యల్ని లోతుగా చూపించే ప్రయత్నం చేశారట.
టెక్నాలజీ మాయలో పడి, వారు ప్రవర్తిస్తున్న తీరు, తద్వారా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల్ని ఈ సినిమాలో హైలైట్‌గా చూపించారట. యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నారు. తెలుగమ్మాయ్ అంజలి, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. పర్‌ఫామెన్స్‌కి స్కోపున్న పాత్రలో నటించింది ఈ సినిమాలో. ఇక ఆండ్రియా 'తడాఖా' తదితర చిత్రాలతో ఈ పాపను కూడా తెలుగు ప్రేక్షకులు బాగానే గుర్తుంచుకున్నారు. చూడాలి మరి 'తారామణి'ని తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో.