ఈ నెల 21న సినిమాల జాతర జరిగింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి ప్రతిష్ఠాత్మక చిత్రాలు, ఎక్కువ సంఖ్యలో విడుదలయ్యాయి. తెలుగులో ఇదే రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన 'అంతరిక్షం', 'పడి పడి లేచె మనసు' సినిమాలు ఓ మోస్తరు టాక్‌తో రన్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో భారీ అంచనాలు నమోదు చేసిన 'జీరో' సినిమా ఇదే రోజు విడుదలైంది. షారూఖ్ ఖాన్ మరుగుజ్జు ప్రయోగం విఫలమైంది. 'జీరో'తో షారూఖ్ హీరో అవుతాడని భావించారంతా. కానీ జోరోగానే మిగలిపోయాడు. డిజాస్టర్‌గా నిలిచింది 'జీరో'.
అదే రోజు అనువాద చిత్రంగా బాలీవుడ్‌లో విడుదలైన కన్నడ మూవీ 'కేజీఎఫ్'కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఓపెనింగ్సే కాదు, వసూళ్లు కొల్లగొట్టేసిందీ సినిమా. వరల్డ్ వైడ్‌గా మంచి టాక్ అందుకుంది. ఇక వసూళ్ల విషయానికి వస్తే 100 కోట్లు దాటేసింది. బాలీవుడ్‌లో 'బాహుబలి' సినిమా తర్వాత ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది ఈ 'కేజీఎఫ్'. బాహుబలితో వసూళ్లను పోల్చలేం కానీ, ఆ సినిమా తర్వాత బాలీవుడ్ తేరుకోలేదు. సరికదా, మరోసారి 'కేజీఎఫ్' రూపంలో తేరుకోలేని షాక్ తగిలింది బాలీవుడ్‌కి.
మొన్నామధ్య వచ్చిన 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'తో బాహుబలిని కొట్టేయొచ్చని ఎక్స్‌పెక్ట్ చేశారు. అది కూడా డిజాస్టర్‌గానే మిగిలిపోయింది. ఇప్పుడు షారూఖ్‌ఖాన్ అయినా ఆడుకుంటాడేమో అనుకుంటే, 'జీరో' రూపంలో మరోసారి డీలా పడక తప్పలేదు. దెబ్బ మీద దెబ్బలు తింటూ బాలీవుడ్ ఎప్పటికి తేరుకునేనో చూడాలి మరి. ఇక 'కేజీఎఫ్' విషయానికి వస్తే, కన్నడ నటుడు యష్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. కథా, కథనాల పరంగా విడుదలైన నాలుగు భాషల్లోనూ ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంటోంది.