అవును, మా సినిమా ఫ్లాపే: యంగ్ హీరోలు

మరిన్ని వార్తలు

ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు తమ సినిమా ఫ్లాప్ అయ్యిందని ఒప్పుకోరు. కొంతమంది అయితే ఫ్లాప్ అయిన సినిమాల గురించి మాట్లాడటానికి మొహం చాటేస్తారు. ఇగోలకి పోయి కొన్ని సార్లు వివాదాల్లోకి కూడా దిగుతుంటారు. కానీ, ఈ మధ్య కొందరు యంగ్ హీరోలు తమ సినిమాలు ఫ్లాప్ అయ్యాయని బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. 

 

గతంలో హీరో విజయ్ దేవరకొండ నోటా సినిమా ఫెయిల్యూర్ గురించి స్వయంగా ట్వీట్ చేసాడు. 'అవును...నోటా సినిమా ఫ్లాప్... మరో మంచి ఎంటర్టైనింగ్ సినిమాతో మీ ముందుకి వస్తా... అని అన్నాడు. ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా 'అంతరిక్షం' సినిమా గురించి ఇలాగే స్పందించాడు. ఈ సినిమా బి, సి సెంటర్స్ లో ఆడేది కాదని... ఇంకో పది కోట్లు ఎక్కువ బడ్జెట్ పెట్టుంటే బాగుండేదేమో అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. 

 

తాజాగా యంగ్ హీరో శర్వానంద్ కూడా ఈ జాబితా లో చేరిపోయాడు. తన తాజా చిత్రం 'పడి పడి లేచే మనసు' భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బోల్తా కొట్టింది. ఈ విషయంపై స్పందించిన శర్వా 'ఈ సినిమా గురించి చాలా ఊహించుకున్నాను. మంచి హిట్ అవుతుందని, పెద్ద రేంజ్ కి వెళ్తుందని అనుకున్నాను. కథ విన్నపుడు, సినిమా చేసేటప్పుడు, ఇప్పుడు కూడా ఒకటైతే బలంగా నమ్ముతున్నాను. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వపడతాను. అయితే విమర్శకులతో పాటూ చాలా మంది అభిమానులని కూడా ఈ సినిమా మెప్పించలేకపోయింది. మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. మళ్ళీ మంచి కాన్సెప్ట్ తో మీ ముందుకి వస్తాను' అంటూ చెప్పుకొచ్చాడు. 

 

మొత్తానికి యంగ్ హీరోలు తమ సినిమా రిజల్ట్ విషయంలో చాలా క్లియర్ గా ఉంటున్నారు. గొప్పలకు పోకుండా ఫెయిల్యూర్ ని అంగీకరిస్తూ అభిమానుల మన్ననలు పొందుతున్నారు. ప్రస్తుతం, వరుణ్ తేజ్ మరియు వెంకటేష్ లు నటించిన 'ఎఫ్2' చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం 'డియర్ కామ్రేడ్' నిర్మాణ దశలో ఉంది. శర్వానంద్ కూడా సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న తన తర్వాతి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS