స్ట్రెయిట్ సినిమాల ఆలోచనలు చాలా తక్కువగా, రీమేక్ ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలుగు సినీ పరిశ్రమలో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. ఇది ‘పింక్’ రీమేక్. దాంతోపాటే, మరో రీమేక్ కూడా చేయనున్నాడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే, ప్రస్తుతం ‘ఆచార్య’ అనే స్ట్రెయిట్ ఫిలింతో బిజీగా వున్న చిరంజీవి, ఆ తర్వాత వరుసగా రెండు రీమేక్ సినిమాలు చేయనున్న సంగతి తెల్సిందే.
ముచ్చటగా మూడో రీమేక్ కూడా లైన్‌లో వుందని అంటున్నారు. అయితే, ఆ వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. ఓ యంగ్ డైరెక్టర్, ఓ తమిళ సినిమాని చిరంజీవికి చూపించాడనీ, అది నచ్చి, చిరంజీవి చేయడానికి ఒప్పుకున్నారనీ ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే, దాన్ని రీమేక్ అని కాకుండా, ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొందినట్లుగా పూర్తిగా కొత్త తరహా ట్రీట్‌మెంట్‌తో సినిమా తెరకెక్కిస్తే బావుంటుందని చిరంజీవి, సదరు యువ దర్శకుడికి సూచించారని సమాచారం. అతి త్వరలోనే ఈ వ్యవహారంపై పూర్తి స్పష్టత రాబోతోందట. ‘వేదాలం’, ‘లూసిఫర్’ చిత్రాల్ని చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్ చేయనున్న సంగతి తెలిసినదే కదా!