నాని కెరీర్ ఇప్పుడు ఒడిదుడుకుల్లో ఉంది. చేతిలో సినిమాలున్నాయి. కానీ.. హిట్టు దరికి రావడం లేదు. తన సినిమాకి భారీ పబ్లిసిటీ ఇచ్చుకొన్నా, బాక్సాఫీసు దగ్గర కాసులు కురవడం లేదు. నాని తాజా చిత్రం `అంటే.... సుందరానికీ`కి మంచి టాక్ వచ్చింది. పబ్లిసిటీ కూడా భారీగా ఖర్చు పెట్టారు. కానీ తీరా చూస్తే.. బాక్సాఫీసు దగ్గర కాసులు కురవడం లేదు. నానికి ప్లస్ అయ్యే ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని పట్టించుకోలేదు. దాంతో.. నిర్మాతలు భారీ నష్టాల బాట పట్టారు. ఈ సినిమాపై దాదాపుగా రూ.40 కోట్లు ఖర్చు పెట్టారు. మైత్రీ మూవీస్ దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ సొంతంగా విడుదల చేసుకొంది. రెండో వారం ముగిసే సరికి ఈ సినిమాకి రూ.12 కోట్ల వసూళ్లు లభించాయి. అయితే ఈ సినిమాకి నాని తీసుకొన్న పారితోషికం అక్షరాలా.. రూ15 కోట్లు. అంటే నాని పారితోషికం కూడా వసూళ్ల రూపంలో వెనక్కి రాలేదన్నమాట.
హిట్టుతో సంబంధం లేకుండా భారీ పారితోషికాలు అందుకుంటున్నాడు నాని. తనకు వరుసగా నాలుగు ఫ్లాపులు పడ్డాయి. అయినా సరే, రెమ్యునరేషన్ తగ్గలేదు. `అంటే.. సుందరానికీ` సినిమా కోసం నాని రూ.15 కోట్లు తీసుకొన్నాడు. అందులో సగం సినిమాపై సంతకం పెట్టేటప్పుడే అందుకొన్నాడు. మిగిలిన సగం.. విడుదలకు ముందు తీసుకొన్నాడు. ఈ సినిమాపై ముందు నుంచీ పాజిటీవ్ బజ్ నడిచింది. అందుకే నాని అడిగినంత పారితోషికం ఇచ్చారు. తీరా చూస్తే.. వసూళ్లు సాధించడంలో ఈ సినిమా పూర్తిగా విఫలం అయ్యింది. నాని కొత్త సినిమా `దసరా`కి కూడా రూ.15 కోట్ల పారితోషికమే అందుకుంటున్నట్టు టాక్.